మయన్మార్ కి భారీగా సాయం పంపిన భారత్
భారత్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. మయన్మార్, థాయ్ లాండ్ లో భారీ భూకంపాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్ భారీగా సాయం పంపింది. ఇప్పటికే ఓ సారి మయన్మార్ కి సాయం పంపింది. తాజాగా మరోసారి కూడా 30 టన్నుల విపత్తు సాయాన్ని పంపించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామాగ్రిని కూడా పంపారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ కర్ముక్, ఎల్ సీయూ 52 లో 30 టన్నుల సాయాన్ని పంపారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రకటించింది.
మరోవైపు ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతుందని భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రకటించారు.ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మూడు స్పెషల్ విమానాల్లో సహాయక సామాగ్రిని మయన్మార్‌కు తరలించింది భారత్. యూపీలోని ఘజియాబాద్ ఇండస్ ఎయిర్ బేస్ నుంచి మయన్మార్‌కు 15టన్నుల సహాయ మెటీరియల్ ను పంపింది. విమానాల్లో ఆహారం, మెడిసిన్, జనరేటర్లు, టెంట్లు, బ్యాగులు, దుప్పట్లు, వాటర్ క్లీనింగ్ మెటీరియల్ పంపించారు. మయన్మార్, థాయ్‌లాండ్‌కు మరింత సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా వుందన్నారు.
మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటి వరకు 1,000 మంది మరణించారని.. 2,376 మంది గాయపడ్డారని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. మయన్మార్ మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది. ఇప్పటికే మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం అయ్యాయి. ఆ శిథిలాల కింద వేల మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.