మహారాణా ప్రతాప్, శివాజీయే జాతీయవీరులు : రాజ్ నాథ్ సింగ్

ఈ దేశానికి మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీయే జాతీయ వీరులని, ఔరంగజేబ్ కాదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఔరంగజేబు, బాబర్ లాంటి వారిని కీర్తించే వారు ఈ దేశంలోని ముస్లింలను అవమానిస్తున్నారని అన్నారు. శంభాజీ నగర్ లో మహా రాణా ప్రతాప్ విగ్రహాన్ని రాజ్ నాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాణా ప్రతాప్ ధైర్యం, దేశభక్తికి ప్రతిరూపమని, శివాజీ మహారాజ్ అంతటి వారు రాణా ప్రతాప్ నుంచి ప్రేరణ పొందారని, ముఖ్యంగా గెరిల్లా యుద్ధ వ్యూహాలతో ప్రేరణ పొందారని పేర్కొన్నారు.
వామపక్ష భావజాలంలో మునిగిపోయిన చరిత్రకారులు రాణా ప్రతాప్, శివాజీకి తగిన గుర్తింపును ఇవ్వలేదని రక్షణ మంత్రి విమర్శించారు. అంతేకాకుండా వారు ఔరంగజేబును భుజాలకెత్తుకున్నారని దెప్పిపొడిచారు. ఔరంగజేబును హీరో అని కీర్తించేవారు… ఔరంగజేబు గురించి నెహ్రూ ఏం రాశారో చదవాలని చురకలంటించారు.
దారాషికో ఉపనిషత్తులను కూడా అనువదించాడని, ఔరంగజేబు అతడ్ని హత్య చేశాడన్నారు. దారాషికో అన్ని మతాలనూ గౌరవించారని గుర్తు చేశారు. ఔరంగాబాద్ ను ఛత్రపతి శంభాజీనగర్ గా, ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చడంలో వున్న తప్పేంటో చెప్పాలని నిలదీశారు.బాబర్, తైమూర్, ఔరంగజేబు, ఘోరీ ని కీర్తించడం వల్ల ముస్లింల ఓట్లు రావని, పైగా ముస్లింలను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *