మాతృభావనే భారతీయత

‌స్త్రీని ఒక శక్తిలా పూజించాలని మన సంప్రదాయాలు చెబుతున్నా నేటికీ అది కార్యరూపం దాల్చలేదు అన్నది వాస్తవం. కానీ ఇప్పడు ఆడదాన్ని ఆటవస్తువుగా చూసే ఆలోచన పుట్టుకొచ్చింది. పురుషుని పక్కటెముక నుంచి పుట్టినది స్త్రీ…. మహిళలు వ్యవసాయ భూములవంటి వారు అని ప్రచారం చేసిన మతాలు, సిద్ధాంతాలు మనదేశం లోకి వచ్చిన తర్వాతే ఆడవారికి ఈ కష్టాలు మొద లయ్యాయి. సూటు, బూటూ వేసుకుని మగవాడు, అరకొర దుస్తుల్లో ఆడది ఉండడమే ఫ్యాషన్‌ అనే భావన పెరిగింది. ఇంకాస్త ముందుకు వెళితే స్త్రీకి ఎలాంటి గౌరవం, విలువ ఇవ్వని జాతులు సైతం భారతీయ మహిళలకు సుద్దులు చెప్పడం, వారికి ఇదిలేదు అదిలేదు అని ఉచిత సలహాలివ్వడం వంటివి చేస్తున్నాయి. ఆడపిల్లల విషయంలో ఏర్పడిన దురాచాలన్నింటికీ మన దేశసంస్కృతీ సంప్రదాయాలే కారణం అని దుష్ప్రచారం చేసి ఊదరగొట్టే వాళ్లూ లేకపోలేదు. ఒకదేశం అభివృద్ధి పథంలో సాగాలంటే మహిళా సాధికారత సాధించవలసిందే తప్పనటం లేదు కానీ ఇప్పడు మహిళా సాధికారత గురించి, హక్కుల గురించీ మాట్లాడే వాళ్లు పాశ్చాత్య పద్థతుల్లో మహిళా సాధికారతను తీసుకురావాలని కోరుకుంటున్నారు. కానీ నినాదాలు, సిద్ధాంతాల వల్ల మహిళలకు స్వేచ్ఛ సమానత్వాలు రావు, సదుద్దేశంతోకూడిన ఆచరణ, ఆలోచన మాత్రమే మహిళలకు మంచి చేస్తుంది.

అన్ని రకాల అధికారాలు, హక్కులూ పొందినా మరికొన్ని దేశాల్లో ఇంకా మహిళలు శారీర కంగానూ, మానసికంగానూ హింసకు గురవుతూనే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో హింసకు గురవుతున్నది స్వీడన్‌ ‌దేశపు మహిళలే. అక్కడ మనదేశంలోలాగే గయ్యాళి అత్తలూ, దుష్టులైన భర్తలూ ఎవరూ లేరు. మరి అక్కడ వాళ్లని హింసకు గురిచేస్తున్నది ఎవరు? దానికి కారణం ఆలోచిస్తే ఆదేశాలలో ఉన్న సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య తేడా లేకుండా పోవడమే కాదు వారి కుటుంబ వ్యవస్థ కూడా కనుమరుగైంది. వారు ఆడదాన్ని కేవలం ఓ గృహిణిగా మాత్రమే భావిస్తారు తప్ప సమాజాన్ని మార్చే ఓ శక్తిలా భావించలేరు. పాశ్చాత్య పద్థతుల్లో మార్పు కోరుకుంటే అవి వ్యవస్థకి మంచి చేసే విధంగా ఉండాలే తప్ప వ్యవస్థని కుంటు పరిచే విధంగా ఉండకూడదు. కానీ నేడు మహిళా సాధికారత పేరుతో పాశ్చాత్య ప్రభావంతో చేసే కొన్ని చేష్టలు మన భారతీయ మహిళ జీవన చిత్రాన్ని వికృతపరిచే విధంగా ఉన్నాయన్నది మాత్రం అంగీక రించకుండా ఉండలేము.

నైతికంగా పతనమయ్యే కుటుంబాన్ని శక్తివంతంగా నిర్మించే బాధ్యత తల్లులపై ఉంది. ఏ మహిళ అయినా సరే ముందు తల్లిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే సహజంగానే సమాజంలో పవిత్రమైన ఆలోచనలు కలుగుతాయి. దాని ప్రభావం సామాజిక వ్యవహారాలలో కనిపిస్తుంది. నేడు మహిళల పట్ల జరుగుతున్న అనేక సంఘటనలకు కారణం సమాజంలో ఉదారత భావన లోపించడమే. ఈ లోపాన్ని అధిగమించా లంటే మాతృభావన మాత్రమే వ్యవస్థలో మార్పులను తీసుకురాగలదు. ఆ భావనే మన భారతీయ సంస్కృతి చెప్పింది..దాన్ని ఆచరిద్దాం!!

– లతాకమలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *