మానవత్వం చాటుకున్న భారత సైన్యం.. రాజౌరీ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలోనే పాక్ అనేక సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కేసింది. భారత్ సరిహద్దు ప్రాంతాల్లోని నివాసాలపై కాల్పులు జరిపింది. షెల్లింగ్ ను ఉపయోగించింది. దీంతో చాలా మంది భారత పౌరులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొందరు తమ నివాసాల్లోనే జాగ్రత్తగా వుండిపోయారు.
అయితే.. పాక్ కాల్పుల వల్ల ప్రభావితమైన పౌరులను ఆదుకోవడానికి భారత సైన్యం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా సోమవారం బారాముల్లాలోని యూరీ సెక్టార్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి, మానవత్వాన్ని చాటుకుంది. పాక్ కాల్పుల్లో గాయపడిన వారు, బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి సైన్యం సహాయం చేస్తోంది. దీన్ని అందరూ అభినందిస్తున్నారు.
పాక్ కాల్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం రాజౌరి. రాజౌరి ప్రాంతంలోని ప్రజలే మొదటగా పాక్ జరిపిన కాల్పులకు ప్రభావితులయ్యారు. వారి ఇళ్లు దెబ్బతిన్నాయి. అనేక మందికి గాయాలు కూడా అయ్యాయి. అలాంటి వారికే భారత సైన్యం ఉచిత వైద్య శిబిరం ద్వారా సాయం చేస్తోంది. తక్షణ ఉపశమనం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన ఔషదాలను కూడా సైన్యం అందించింది. స్థానికులు చెప్పిన విషయాలన్నింటినీ సావధానంగా ఆర్మీ వైద్యులు విని, కావల్సిన ఔషదాలను అందించారు.అయితే రాజౌరీ ప్రజలు పాక్ జరిపిన కాల్పుల గురించి గుర్తు చేసుకుంటూ మీడియాకి పలు విషయాలను వెల్లడించారు. రాజౌరీలోని ఓ గ్రామ పెద్ద మహ్మద్ మాట్లాడుతూ ‘‘పాక్ జరిపిన కాల్పుల వల్ల బుల్లెట్లు భవనంపై పడ్డాయి.నా ఇల్లు మొత్తం కూలిపోయింది.నా కుటుంబానికి ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. టెంట్లు మరియు ఇతర సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.