ముక్కోటి ఏకాదశి

విష్ణు మూర్తి ఆరాధకులు పరమ పవిత్ర మైన దినంగా భావించే రోజు ఇది. అదే ముక్కోటి ఏకాదశి ! ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. హిందువుల కాలెండర్‌ ‌ప్రకారం ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తుంది. అంటే ఆంగ్ల కాలెండర్‌ ‌ప్రకారం డిసెంబర్‌-‌జనవరి నెలలలో అన్న మాట. ‘‘స్వర్గద్వారం’’, ‘‘ముక్కోటి ఏకాదశి’’, ‘‘వైకుంఠ ఏకాదశి’’ అని పేరున్న ఆ పర్వదినాన వైష్ణవాలయాల్లో ఏకాదశిని ఎంతో బ్రహ్మాండంగా జరుపుతారు. శ్రీమహావిష్ణువు సర్వాలంకార భూషితుడై వైకుంఠం ఉత్తర ద్వారం వద్దకు విచ్చేయగా… అక్కడ సకలదేవతలు ఆయనను సేవించిన రోజు కనుక దీనికి ‘‘వైకుంఠ ఏకాదశి’’ అని పేరు ఏర్పడింది. అందువల్ల ఈ దినం వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపున వున్న వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ ద్వారం నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదంగా భావించబడుతోంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువుతో పాటూ ముప్పైమూడు కోట్ల మంది దేవతలు భూమికి దిగివస్తారని చెప్తారు. అందువల్లనే దీనికి ‘‘ముక్కోటి ఏకాదశి’’ అని పేరు. మన రాష్ట్రంలోని తిరుమల, భద్రాచలం తదితర విష్ణుమూర్తి క్షేత్రాలలోనూ, తమిళనాడు శ్రీరంగంలో ముక్కోటి ఏకాదశిని ఘనంగా జరుపుతారు. ఈనాడు వైకుంఠ ద్వారాలను తెరుస్తారని, దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములంతా స్వర్గానికి చేరుకుంటారని ప్రతీతి. ఈ దినం ఏకాదశీ వ్రతం చేసి, విష్ణువును పూజించి, ఉపవాస జాగరణలు పాటించడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి. ఈరోజు విష్ణుమూర్తి ఆలయాలలో ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat