యూకేకి రవిశంకర్ బృందం, అమెరికాకి థరూర్ బృందం.. ప్రకటించిన కేంద్రం
ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ భారత్ పై ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఎండగట్టాలని భారత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఏడు అఖిలపక్ష బృందాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఏయే బృందాలు, ఏయే దేశాలకు వెళ్లనున్నాయో కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉదయం జాబితాను విడుదల చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ జాబితాను విడుదల చేశారు.
1. రవిశంకర్ ప్రసాద్ బృందం : యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్
2. బైజయంత్ పాండా బృందం : సౌదీ, కువైట్, బెహ్రయిన్, అల్జీరియా
3. సంజయ్ కుమార్ ఝా బృందం : ఇండోనేసియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్
4. శశి థరూర్ బృందం : యూఎస్, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా
5. శ్రీకాంత్ శిందే బృందం : యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్
6. కనిమొళి బృందం : స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యా
7. సుప్రియా సూలే బృందం : ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన భారత్, ఇప్పుడు పాకిస్థాన్‌పై దౌత్య యుద్ధానికి సిద్ధమవుతోంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి అంతర్జాతీయ వేదికలపై మాట్లాడేందుకు అఖిలపక్ష బృందాలను వివిధ దేశాలకు పంపనుంది. వచ్చే వారమే భారత అఖిలపక్ష బృందాల విదేశీ పర్యటనలు మొదలవుతాయి. దాదాపు 10 రోజుల పాటు ఈ పర్యటనలు కొనసాగుతాయి.కేంద్ర ప్రభుత్వం సూచించే దేశాలలో అఖిలపక్ష బృందాలు పర్యటిస్తాయి. ఈ దౌత్యపరమైన కసరత్తులో భాగమయ్యేందుకు భారత్‌లోని విపక్ష పార్టీలు కూడా అంగీకారం తెలిపాయి. దీంతో ఆయా ప్రతిపక్ష పార్టీల సభ్యులకూ అఖిలపక్ష బృందాలలో చోటును కల్పించారు.