యూపీ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ‘‘అయోధ్య‘‘
అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తైంది. ధ్వజా రోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కేవలం సాంస్కృతిక మైలు రాయిని సూచించడమే కాకుండా ఓ ఆర్థిక శక్తి కేంద్రంగా కూడా అయోధ్య నగరం వేగవంతంగా పెరుగుతోంది.
మందిర నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచే అయోధ్య నగరం యూపీ రాష్ట్ర ఆర్థిక పటాన్ని క్రమంగా తిరగ రాస్తోంది. అయోధ్య మాస్టర్ ప్లాన్ కింద 2031 నాటికి 85,000 కోట్లు పెట్టబడిగా పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇందులో, గత ఐదు సంవత్సరాలలో రూ.2,150 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారు. దీని వల్ల యూపీ ప్రభుత్వానికి 18 శాతం పన్ను రాబడి లభిస్తోంది.
రియల్ ఎస్టేట్‌లో వృద్ధి మరియు ఆధ్యాత్మిక పర్యాటకంలో అపూర్వమైన పెరుగుదలతో, అయోధ్య త్వరగా ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద వృద్ధికి చోదక కేంద్రాలలో ఒకటిగా మారుతోంది.పర్యాటకుల సంఖ్య పరంగా ఈ నగరం ఇప్పటికే తాజ్ మహల్, వారణాసి వంటి దిగ్గజ గమ్యస్థానాలను అధిగమించింది. 2023లో, అయోధ్యను 5.75 కోట్ల మంది సందర్శకులు సందర్శిస్తే, 2024 లో 16 కోట్లకు, 2025 మొదటి ఆరు నెలల్లోనే 23 కోట్లకు పెరిగింది.ఇటీవల జరిగిన మహా కుంభమేళా ద్వారా కూడా అయోధ్యకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీంతో ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించాయి.
ప్రస్తుతం పర్యాటకం ద్వారా అయోధ్యకు ఏటా రూ.10,000 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. ఈ సంఖ్య 2028 నాటికి రూ.18,000 నుండి రూ.20,000 కోట్ల మధ్య పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్ మొత్తం పర్యాటక ఆదాయం రూ.70,000 కోట్లు దాటుతుందని అంచనా. అంటే మొత్తంలో నాలుగో వంతు ఆదాయాన్ని అయోధ్య నగరం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది.
అయోధ్యను ప్రపంచ స్థాయి ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సంయుక్తంగా దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి.ప్రస్తుతం 11 లక్షలుగా ఉన్న నగర జనాభా 2031 నాటికి 24 లక్షలు దాటి, 2047 నాటికి 34 లక్షలకు పెరుగుతుందని అంచనా.అయోధ్య వేగవంతమైన వృద్ధి రియల్ ఎస్టేట్ మరియు హాస్పిటాలిటీ రంగాలలో కూడా పెద్ద ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవలి నెలల్లోనే, ఇండియన్ హోటల్స్, మారియట్, రాడిసన్ మరియు లెమన్ ట్రీతో సహా 70 కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ హోటళ్లు అయోధ్యలో తమ ప్రాజెక్టులను ప్రారంభించాయి.
పర్యాటకుల ప్రభావం తీవ్రంగా పెరగడంతో స్థానిక వ్యాపారులకు, అర్చకులకు, పూజా వస్తువులు, హస్తకళలు, దాని సంబంధిత వ్యాపారులు, ఆహార హోటళ్లు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది.అయోధ్య పురోగతి ఉత్తరప్రదేశ్ యొక్క గ్రీన్ ఎనర్జీ ప్రొఫైల్‌ను కూడా బలోపేతం చేసింది. సౌర విద్యుత్ పరంగా కూడా దేశంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత యూపీయే మూడో సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది.
రాష్ట్రంలోని 17 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో అయోధ్య ముందుంది.యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2031 నాటికి దీనిని పూర్తిగా సౌరశక్తితో కూడిన నగరంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.2029 నాటికి ఉత్తరప్రదేశ్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను, అంటే దాదాపు రూ.89 లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నందున, ఈ లక్ష్యాన్ని సాధించడంలో అయోధ్య గణనీయమైన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.ఈ నగరం ప్రస్తుతం రాష్ట్ర GDPకి 1.5 శాతం వాటాను అందిస్తోంది, రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కూడా అధికారులు ప్రకటించారు.