రాజస్థాన్‌లో  ప్రాచీన నీటి సంరక్షణ విధానాలు

రాజస్థాన్‌ ‌దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. ఇది జనాభాపరంగా తొమ్మిదివ స్థానంలో ఉంది. అయినప్పటికీ వర్షపాతానికి సంబంధించి అన్ని రాష్ట్రాల కన్నా వెనుకబడి ఉంది. ఒకానొకప్పుడు ఇక్కడ సముద్రం నుంచి చల్లని గాలులు వీస్తుండేవి. కానీ నేడు ఇసుకతో కూడిన గాలి దుమారాలు కనిపిస్తున్నాయి.

రాజస్థాన్‌ ‌పర్వత సానువుల్లోని జిల్లాలకు మంచి వర్షపాతం నమోదవుతుంది. కానీ పశ్చిమ రాజస్థాన్‌లో ఒక్క వాన చినుకు పడదు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో చిక్కుకున్న రాజస్థాన్‌లో వర్షపు నీటి సంరక్షణకు అనేక విధానాలు ఉద్భవించాయి.

ఎక్కడైతే నాలుగు వైపులా పర్వతాల నుంచి నీరు కిందకు పడుతుందో, ఎక్కడైతే వర్షాలు బాగా పడతాయో అలాంటి ప్రాంతాల్లో లభించే నీటిని కట్టడి చేయడానికి సరస్సులు లేదా చెరువులు లేదా తటాకాలు నిర్మితమవుతుంటాయి. జైసల్మేర్‌ ‌రాజు మహారావల్‌ ‌ఘడ్‌సీ ద్వారా 1935లో నిర్మితమైన ఘఢ్‌సీసర్‌ ‌చెరువు అనిర్వచనీయమైన ఇంజినీరింగ్‌ ‌నైపుణ్యానికి అద్దం పడుతున్నది. మూడు మైళ్ళ పొడవు, ఒక మైలు వెడల్పు గట్టుతో కూడిన ఈ చెరువు 120 చదరపు మైళ్ళ మేరకు విస్తరించి ఉంది. చెరువుతో పాటుగా స్నానాల రేవు, దేవాలయం, పాఠశాల ఉండేవి. విస్తారమైన చెరువులోకి చేరిన నీటిని ప్రవాహ రూపంలో పంట పొలాలకు మరలించే నిమిత్తం ఎనిమిది కిలోమీటర్ల పొడవైన కాలువను నిర్మించారు.

జైసల్మేర్‌కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో జసేరి పేరిట చెరువు ఒకటి ఉంది. ఈ చెరువులో నీరు ఎప్పటికీ ఇంకిపోదు. జసేరి అడుగున సున్నపు రాతి ఫలకాలు ఉన్నాయి. ఆ కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోదు. ఆ రకంగా ఇందులో రాతినీరు, వర్షపు నీరు ఇలా రెండు రకాల నీరు నిరంతరాయంగా లభిస్తాయి. గత వర్షపు నీరు ఇంకిపోక మునుపే వర్షాలు వచ్చేస్తుంటాయి. చెరువు మధ్యలో ఒక మెట్ల బావి కూడా ఉంది.

జలాశయాలు: ఎక్కడైతే నీటి లభ్యత తక్కువగా ఉంటుందో అలాంటి చోట్ల నీటిని నిల్వ ఉంచడానికి ఆనకట్టతో కూడిన జలాశయాలు నిర్మిస్తారు. ఇది భూ మట్టానికి మూడు నుంచి 12 మీటర్ల ఎత్తున ఉంటుంది. వర్షపు నీరు ఇందులోకి వచ్చి చేరుతుంది. జైసల్మేర్‌లో జనశ్రుతిని అనుసరించి 84 గ్రామాల్లో 700కు పైగా ఆనకట్టల తాలూకు ఆనవాళ్ళు కనిపిస్తాయి. 1520 సంవత్సరంలో రావ్‌ ‌జోధా మొట్టమొదటి ఆనకట్టతో కూడిన జలశయాన్ని నిర్మించారు.

భారీ జలశయాలు లేదా తటాకాలు: ఇవి పైన పేర్కొన్న వాటి కంటే అతి పెద్దవి. వీటిలో అత్యధిక పరిమాణంలో నీరు నిల్వ ఉంటుంది. ఈ భారీ జలశయానికి మట్టితో కూడిన ఆనకట్ట ఉంటుంది. వర్షపు నీటిని నిల్వ ఉంచడానికి వీటిని నిర్మిస్తారు.

 సాంభర్‌ ‌జిల్లాలో ఉప్పు నేలల్లో నిర్మించిన మంచి నీటి తటాకం వాన నీటి సంరక్షణకు ఒక అద్భుతమైన నమూనాగా నిలుస్తున్నది.

ఖడీన్‌ ‌లేదా భూమట్టంపై జల సంరక్షణ వ్యవస్థ: భూమిపై పారే వర్షపు నీటిని నిల్వ ఉంచడానికి భూగర్భంలో నిర్మించే జల సంరక్షణ వ్యవస్థను ఖడీన్‌ అం‌టారు. దీనికి రెండు వైపులా మట్టి గోడలు ఉంటాయి. మూడవ వైపున మట్టితో ఒక దుప్పటి లాంటిది నిర్మితమై ఉంటుంది. ఖడీన్‌ 5 ‌నుంచి 7 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంటుంది. గోడలు 2 నుంచి 4 మీటర్ల ఎత్తులో ఉంటాయి. అధికంగా చేరుకున్న నీటిని మరో ఖడీన్‌కు పంపిస్తారు. ఈ జల సంరక్షణ పక్రియ ద్వారా బంజరు భూమిని సైతం సాగుకు యోగ్యమైన భూమిగా మార్చవచ్చు. ఎక్కడైతే నీటి లభ్యత తక్కువగా ఉంటుందో అక్కడ నీటిని ఆపడానికి కట్టే ఆనకట్టను ఖడీన్‌ ఆనకట్ట అంటారు. జైస్మలేర్‌లో చిన్నవి, పెద్దవి కలుపుకొని మొత్తంగా 500 ఖడీన్‌లు ఉన్నాయి. నీరు విస్తారంగా లభించినప్పుడు వీటి దగ్గర గోధుమ పంట పండిస్తారు.

మెట్ల బావి

భూగర్భ ట్యాంకులు: ఇసుక ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణ నిమిత్తం అనాది కాలంగా భూగర్భ ట్యాంకులను నిర్మిస్తున్నారు. వీటిలో నీటిని కేవలం తాగడానికి మాత్రమే వినియోగిస్తారు. ఇది చూడ్డానికి భూమిలో నిర్మించిన ఒక చిన్నపాటి ట్యాంకును పోలి ఉంటుంది. ఎక్కడైతే దీనిని నిర్మిస్తారో ఆ ప్రాంతాన్ని నీటి గట్టు అని పిలుస్తారు. అలా పిలవడం ద్వారా భూగర్భ ట్యాంకు నిర్మితమైన ప్రాంతాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచుతారు. ట్యాంకు పైన మూత ఉంటుంది. దానికి ఒక జల్లెడ ఉంటుంది. పురుగు పుట్రా మరే ఇతర చెత్తా చెదారం ట్యాంకులో పడకుండా ఈ జల్లెడ అడ్డుకుంటుంది. ఈ ట్యాంకు 30 నుంచి 40 అడుగుల లోతు ఉంటుంది. ట్యాంకులో పడిన నీరు భూమిలోకి ఇంకిపోకుండా చుట్టూ ఉన్న గోడల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇది చాలా విశాలంగా ఉంటుంది. ఈ ట్యాంకుల ద్వారా 10,000 లీటర్ల నుంచి 50,000 లీటర్ల దాకా నీటిని సంరక్షించవచ్చు. జైపూర్‌లోని జయగఢ్‌ ‌కోటలో నిర్మించిన ట్యాంకు అత్యంత విశాలమైనది.

పుష్కరిణి: పెద్ద పెద్ద చెరువులపైన ఆధారపడి నిర్మించే జలసంరక్షణ వ్యవస్థను దానిని పుష్కరిణి అంటారు. ఇందులో నీరు తాగడానికి పనికి రాదు. కేవలం స్నానం, ఇతర కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. చతురస్రాకారంలో ఉండే దీనికి మూడు వైపులా మెట్లు ఉంటాయి.  రాజస్థాన్‌ ‌లేదా గుజరాత్‌లో ఇవి అత్యధికంగా కనిపిస్తాయి. జోధ్‌పూర్‌లోని మహా మందిర్‌లో 1660 సంవత్సరంలో నిర్మితమైన పుష్కరిణి ప్రపంచ ప్రసిద్ధి చెందినది.

ఆనకట్ట: రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో మేవాఢ్‌ ‌ప్రాంతంలో ఆనకట్టలు విస్తారంగా ఉంటాయి. నైరుతి రుతు పవనాల కారణంగా వచ్చిన వర్షపు నీటిని కాలువల ద్వారా మళ్ళించి ఆనకట్టల వద్దకు చేరుస్తారు. అక్కడ నీటిని నిల్వ ఉంచుతారు. వీటిని రాతితో నిర్మించిన కారణంగా నీరు భూమిలోకి ఇంకిపోకుండా ఉంటుంది. రకరకాల పనులకు ఉపయోగపడుతుంది.

మెట్ల బావి: రాజస్థాన్‌లో వీటిని బావ్‌ఢీ అంటారు. గుజరాత్‌లో వావ్‌ అని పిలుస్తారు. కొన్ని మెట్ల బావులు వాస్త్ర శాస్త్ర నైపుణ్యానికి అద్భుతమైన ప్రతిబింబాలుగా నిలుస్తాయి. మెట్ల బావిలో నీరు స్నానపానాదులకు మిక్కిలి ఉపయుక్తమైనది. మెట్ల బావుల్లో అత్యధికం దేవాలయాలు, కోటలు లేదా మఠాలకు సమీపంలో నిర్మితమై ఉంటాయి.

పురాతన కాలంలో ఇక్కడ ప్రజలు వాన నీటిని సంరక్షించుకుంటూనే అందుబాటులో ఉన్న నీటిని అనేక పర్యాయాలు ఉపయోగించుకునేవారు. స్నానాల గది నుంచి తవ్విన కాలువ ద్వారా స్నానపు నీటిని ఒక చోటుకు చేర్చేవారు. అలా వచ్చిన నీటితో వస్త్రాలు శుభ్రపరచుకునేవారు. ఆ నీటిని మళ్ళీ ఒక చోటుకు చేర్చి ఇంటిని, పెరడును శుభ్రపరుచుకోవడానికి వినియోగించేవారు. ఆ సమయంలో బూడిద లేదా ఇసుకను వాడేవారు. అలా చేయడం వల్ల నీటికి ఎలాంటి మాలిన్యం అంటకుండా మరింత స్వచ్ఛంగా ఉంటుంది. ‘ప్రకృతి నుంచి వాడుకున్నంత వాడుకోవాలి’ అన్న భావనకు బదులుగా ‘ప్రక ృతి మనకు ఎంత ఇచ్చిందో తిరిగి అంతే మనం ప్రక ృతికి ఇవ్వాలి’ అన్న భావనతో నీటిని వినియోగించుకునేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *