రైతులకు అండగా ముల్కనూర్ సహకార బ్యాంక్
సాధారణంగా పంట రుణాల కోసం రైతులు అనేక ప్రైవేటు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తుంటారు. రుణాలు మంజూరు చేసే ప్రైవేటు బ్యాంకులు కూడా రైతులను వేధిస్తూ నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తుంటారు. సరైన సమయానికి పంట రుణాలు అందక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ కరీంనగర్ జిల్లాలోని 60 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ముల్కనూర్ సహాకార గ్రామీణ బ్యాంకు, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (ఎం.సి.ఆర్.బి.ఎం.ఎస్) రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తోంది. సరైన సమయంలో వ్యవసాయదారులకు ఇబ్బంది లేని రుణాలు, సంక్షేమ పథకాలను అందిస్తూ రైతులకు బాసటగా నిలుస్తోంది.
ఈ సహాకార సంఘం కృషి వల్ల దీనిపై ఆధారపడిన 14 గ్రామాల్లో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒక్కటి కూడా చోటు చేసుకోలేదు. రైతులకు అత్యుత్తమ సేవలందిస్తున్నందుకు గాను గతేడాది ఈ సంస్థ జాతీయ స్థాయిలో అవార్డును అందుకుంది.
ఈ సందర్భంగా బ్యాంక్ అధ్యక్షుడు ఎ. ప్రవీణ్ రెడ్డి సహకార సంఘం గురించి మరిన్ని విషయాలు పంచుకున్నారు.
1956లో కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మూల్కనూర్ గ్రామంలో 373 మంది రైతులతో రూ.2300 ప్రారంభ పెట్టుబడిగా ఈ సంస్థ (ఎం.సి.ఆర్.బీ.ఎం.ఎస్) స్థాపించ బడిందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో సరైన వర్షాలు లేక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉండేదని, రైతులకు పంట రుణాలను అందేవి కావని, వడ్డీ వ్యాపారులు కూడా అధిక వడ్డీ రేట్టు వసూళ్లు చేయడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు స్థాపించిన సంఘంలో ప్రస్తుతం భీమదేవర పల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని 14 గ్రామాలకు చెందిన 7,300 మంది సభ్యులున్నారని ఆయన అన్నారు. 120కోట్ల వార్షికదాయంతో సంఘం నడుస్తోందని, 99 శాతం పంట రుణాల రికవరీ రేటును బ్యాంక్ నమోదు చేస్తుందని తెలిపారు.
ఈ బ్యాంకు వ్యవసాయ రంగానికి అనేక సేవలందిస్తోందని, వివిధ పంటల సాగుకు 7శాతం రేటు వడ్డీకి తీసుకునే రుణాలు వీటిలో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో కూడా ఈ సంఘం రైతులను ప్రోత్సహిస్తోంది ప్రవీణ్ రెడ్డి తెలిపారు. రైతులకు మార్కెంటింగ్ అవకాశాలను కూడా ఈ సంఘం కల్పిస్తోందని, దళారుల బెడద లేకుండా సంఘం రైతులకు అండగా ఉంటుందని, సంఘంలో ఉన్న సభ్యులకు బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తోందని తెలిపారు. రైతుల పశువులను, రైతుల ఉత్పత్తులను నిల్వ చేయడానికి గ్రామాల్లో 52 గిడ్డంగులను కూడా నిర్మించిందని, సంఘంలోని సభ్యుల కోసం పెట్రోల్ బంక్, గ్యాస్ ఏజెన్సీ, షాపింగ్ కాంప్లెక్స్, కాటన్ జిన్నింగ్ మిల్లు, రెండు రైస్ మిల్లులను నడుపుతోందని ఆయన తెలిపారు.
రైతుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఇంటర్మీడి యట్, డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేసిందని, అలాగే పిల్లల చదువు కోసం రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోందని, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, ఇంజనీరింగ్, వెటర్నరీ, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే రైతుల పిల్లలకు స్కాలర్షిప్లు కూడా అందిస్తోందని ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.