లాభాలొద్దు… దేశభక్తే ముఖ్యం… పాక్ కి తమలపాకులు ఆపేసిన రైతులు
అమాయకులైన, నిరాయుధులైన హిందూ పర్యాటకులపై పహల్గాంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన దాడి అందర్నీ కలచివేసింది. కదలించింది. పాకిస్తాన్ కి, ఇస్లామిక్ ఉగ్రదాడులకు తగిన జవాబివ్వాలని కూడా ముక్తకంఠంతో నినదించారు. దీని తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ ను చేపట్టి, ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమమైన విషయం తెలిసిందే. దీంతో హోన్నావర్ రైతులు తమ లాభాలను పక్కనెట్టేశారు. దేశ భక్తినే చూపిస్తున్నారు. పాకిస్తాన్ కి తమలపాకులు చేరకుండా బ్రోకర్ల వ్యవస్ధనూ నిలిపేశారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న హోన్నావర్ రైతుల ఆదర్శ కథనం.
అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత కర్నాటకలోని హోన్నావర్ లోని రైతులు దేశానికి సంఘీభావంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ కి తమలపాకుల ఎగుమతులను నిలిపేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో స్వచ్ఛందంగానే, తామే ఈ నిర్ణయం తీసుకున్నామని రైతులు ప్రకటించారు. తమకు, తమ వ్యాపారానికి భారీగా నష్టం వాటిల్లుతుందని తమకు తెలుసని, అయినా… తమకు దేశభక్తే ముఖ్యమని రైతులు ప్రకటించారు.
హోన్నావర్ తమల పాకులకు దేశ వ్యాప్తంగా భారీ డిమాండే వుంది. నాణ్యత, రుచితో పాటు ఎక్కువ కాలం నిల్వ వుంటాయని ప్రసిద్ధి. కొన్ని దశాబ్దాలుగా షరావతి నది బేసిన్ లో పండించే తమలపాకులు దేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా వెళతాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వీటికి బాగా డిమాండ్ కూడా వుంది. అందులో భాగంగానే నేరుగా కాకుండా వివిధ వ్యక్తుల ద్వారా పాకిస్తాన్ కి కూడా ఇవి వెళతాయి. ఇరు దేశాల మధ్య కాస్త సంబంధాలు బాగా లేకపోయినా… ఈ తమలపాకులు పాకిస్తాన్ కి వెళ్లేవి. కానీ.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత హోన్నావర్ రైతులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ‘‘ఇక చాలు. ఇన్ని రోజులు జరిగింది చాలు. ధర పడిపోయినా పర్వలేదు. నష్టం వచ్చినా పర్లేదు. తమ తమలపాకు పంటను మాత్రం పాకిస్తాన్ కి వెళ్లనివ్వం. మా మనస్సాక్షి అంగీకరించడం లేదు. శాశ్వతంగా పాకిస్తాన్ కి పంటను ఆపేస్తున్నాం.’’ అని రైతులు ప్రకటించారు.
అంతేకాకుండా మరింత పటిష్ట నిర్ణయాలు కూడా తీసుకున్నారు. బ్రోకర్ల వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ కి తమలపాకులు చేరకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని బ్రోకర్లను కూడా నిషేధించారు. వీరి ద్వారానే పాకిస్తాన్ కి తమల పాకులు చేరుతున్నట్లు రైతులు గ్రహించడం విశేషం. ఈ బ్రోకర్లను కూడా బ్లాక్ లిస్టులో పెట్టేశారు. అత్యంత విశ్వసనీయంగా వుండే బ్రోకర్లకే తమల పాకులను అమ్ముతున్నారు. రైతులు చేస్తున్న చర్యలను చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఏ కోశాన కూడా తమల పాకులు పాకిస్తాన్ కి చేరకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.