వనవాసులు, నగరవాసులు అన్న విభజన తెచ్చింది ఆంగ్లేయులే : జనజాతీ గౌరవ దివస్ లో వక్తలు

వనవాసులు, నగర వాసులు వేరుకాదని, దురదృష్టవశాత్తు ఆంగ్లేయులు.. వీరిద్దరూ వేర్వేరు అన్న భావనను రేకెత్తించారని ప్రముఖ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు, రాకాలోకం ఫేమ్ రాకా సుధాకర్ అన్నారు. ప్రతి హిందువు జీవితంలో నాలుగు ఆశ్రమాలుంటాయని అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలని వివరించారు. మనందరమూ జీవితంలో అన్నీ అనుభవించిన తర్వాత, అన్నింటినీ చేరుకున్న తర్వాత వెళ్లాల్సింది వనాలలోకేనని, ఇదే మన శాస్త్రాలు చెబుతున్నాయని, దీనిని మనం మరిచిపోయామని అన్నారు. వనవాసీ కల్యాణ పరిషత్ తెలంగాణ ప్రాంతం ఆధ్వర్యంలో భాగ్యనగర్ (హైదరాబాదు)లో జనజాతీ గౌరవ దివస్ జరిగింది. దీనికి ముఖ్య వక్తగా రాకా సుధాకర్ హాజరయ్యారు.
వనవాసులు వేరు, నగర వాసులు వేరన్న దురభిప్రాయం కలుగుతోందని, ఇది తప్పు అని ఈ సందర్భంగా  సుధాకర్ అన్నారు. ప్రస్తుతం బిర్సాముండా 150వ జయంతి జరుగుతోందని, ప్రజలందర్నీ కదిలించి, దేశ స్వాతంత్రం కోసం పనిచేసేట్లు చేసిన వందేమాతరానికి కూడా 150 సంవత్సరాలు అని గుర్తు చేశారు. వందేమాతరం కలకత్తాలో పుట్టిన సమయంలోనే సరిగ్గా అదే సమయంలో బిర్సాముండా జన్మించారని, ఇది కాకతాళీయమేమీ కాదని, దైవ ప్రణాళికలో భాగంగానే జరిగిందని, స్వాతంత్రం కోసం వనమూ, నగరమూ ఏక కాలంలో ఒకే రకంగా పోరాడడానికి సన్నద్ధమైన ఉదాహరణే అని విశ్లేషించారు.
raka2
వనవాసులను వెనకబడినవారని అంటారని, 1857 భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్నగూడం అనే గ్రామంలో గిరిజనులు, గిరిజనేతరులైన కొండ రెడ్లు ఏడాది పాటు ఆంగ్లేయులపై పోరాటం చేశారని, ముప్పుతిప్పలు పెట్టారన్నారు. కారుకొండ సుబ్బారెడ్డి నాయకత్వంలో నగరవాసులు, గిరివాసులు, కోయలు, మిగతా అనేకానేక సముదాయ వారు కలిసి పోరాడారని పేర్కొన్నారు. ఏక కాలంలో వనవాసులు, వనవాసేతరులు 1857లో ఎర్నగూడంలో పోరాటం చేశారని, దీని తర్వాత కారుకొండను అరెస్ట్ చేశారన్నారు. ఎందుకు ఉద్యమం చేస్తున్నావని ఆంగ్లేయులు ప్రశ్నించగా… ‘‘నా నాయకుడైన నానాసాహేబ్ పీష్వా ఆదేశం మేరకే పోరాటం చేస్తున్నా’’ అని వెల్లడించారని తెలిపారు. నానా సాహెబ్ పేష్వా కాన్పూర్‌లో వుండేవారని, అక్కడుండే పేష్వా ఆదేశాల మేరకు ఇక్కడ వున్న పశ్చిమ గోదావరిలో పోరాటం చేశారని వివరించారు.
అలాంటిదే జర్మనీ నుంచి ఒడిశా బాలాసోర్ కి ఆయుధాలు తీసుకొచ్చి, ఆంగ్లేయులపై పోరాటం చేయాలని బాబా జతీన్ ప్లాన్ వేశారని, సరిగ్గా అదే సమయానికి రాంచీ, ఛత్తీస్ గఢ్ లో వున్న వనవాసులు కైసర్ బాబాకీ జై అని పలుకరించుకునేవారని, ఈ కైసర్ అప్పట్లో జర్మనీలో వున్న పాలకుడు అని తెలిపారు. కాబట్టి వనవాసీ ప్రాంతాల్లో, అడవుల్లో నివసించే వారు మమ్మల్ని కాపాడటానికి కైసర్ ఆయుధాలు వస్తున్నట్లు చెప్పుకునేవారని, కానీ ఆంగ్లేయులకు తెలిసేది కాదన్నారు. దీనిని బట్టి, వనవాసులు, నగరవాసులు వేర్వేరు కాదని, నగర వాసులు స్పందించినటువంటి ప్రతి దానికి దాని ప్రతిధ్వని వనవాసుల్లో జరిగిందనడానికి స్పష్టమైన ఉదాహరణ అని వివరించారు.
వనవాసుల్ని వేరు చేసింది ఆంగ్లేయులేనని, ఆంగ్లేయులు రాక మునుపు అడవుల్లోకి అందరికీ ప్రవేశం వుండేదని, అడవుల్లో ఉండేవారు మన దగ్గరికి వచ్చేవారని, వేంకటేశ్వర స్వామి పెళ్లి కుదిర్చింది ఓ ఎరుకల సాని అని, పద్మావతీ దేవికి ఆమె సోది చెబితే తప్ప, ఆమెకు వెంకటేశ్వర స్వామితో వివాహం జరగలేదన్నారు. అలాగే హిరణ్యకశిపుడ్ని చంపిన తర్వాత, ఆగ్రహంతో వున్న నరసింహ స్వామి కోపాన్ని చల్లబరచిన ఏకైక శక్తి చెంచు లక్ష్మి అని ,ఆమె గిరిజనురాలని గుర్తు చేశారు. కాబట్టి గిరిజన, గిరిజనేతర భేదం ఏనాడూ లేదని, ఇది ఆంగ్లేయులే తెచ్చారని స్పష్టం చేశారు. గోండులు అంటే “రాం రాం”, మిగతా వారు జై శ్రీరాం అంటారని, అసలు తేడా ఎక్కడ వుందని సుధాకర్ ప్రశ్నించారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్రైస్తవులుగా మారిన నాగా గిరిజనులు కూడా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా, సుభాష్ చంద్రబోస్‌తో కలిసి పోరాటం చేశారన్నారు. క్విట్ ఇండియా సమయంలో నేతాజీ సైన్యం ఈశాన్య రాష్ట్రాల్లోకి వచ్చిందని, మోయిరాంగ్‌లో ఇప్పటికీ ఆజాద్ హిందూ ఫౌజ్ మ్యూజియం వుందన్నారు. నేతాజీకి సహకరించింది నాగాలు అని అన్నారు. తర్వాతి కాలంలో భారత్ కి వ్యతిరేకంగా పోరాడిన అంగామీ ఫిజో నేతాజీతో కలిసి ఆంగ్లేయులతో పోరాడారని, క్రైస్తవుడైనా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. దేశంలో ఎక్కడ ఏ ధ్వని వినిపించినా, గిరిజనుల్లో ప్రతిధ్వని వినిపించిందని.. దీనిని అర్థం చేసుకోవాలని అన్నారు.
1872లో దేశంలో మొదటి సారిగా ఈశాన్య భారతాన్ని వేరు చేయడానికి “ఇన్నర్ లైన్” సిస్టమ్ వచ్చిందన్నారు. అంటే అక్కడికి వెళ్లాలంటే అనుమతులు తీసుకోవాలని, అంతకు ముందు సాధువులు, సంతులు, గృహస్థులు ఇలా అందరూ వెళ్లారని, వనవాసులు కూడా ఇటు వైపు వచ్చేవారన్నారు. మణిపూర్‌లో అయితే అక్కడి రాజు ప్రతి యేడాది అక్టోబర్‌లో ఓ పండగ చేసేవారని, వనవాసీ రాజులందర్నీ తన రాజ ప్రాసాదానికి పిలిపించి, అంగవస్త్రంతో నేలను తూడుస్తూ స్వాగతం పలికేవారన్నారు. దీనినే ‘‘మేరా హోచాంగ్ బా’’అని పిలుస్తారన్నారు. నేడు అక్కడ రక్తపాతం నడుస్తోందని, ఒకప్పుడు రాజు స్వయంగా స్వాగతం పలికారన్నారు. అసలు తేడాలు ఎక్కడ వచ్చాయో అర్థం చేసుకోవాలన్నారు.
raka23
ముఖ్య అతిథిగా విచ్చేసిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ సీ.హెచ్. వేంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఈ దేశ సుమారు 40 శాతం అడవులు, కొండలు, గుట్టలతోనే వుందని, 60 శాతం మైదానంగా వుందన్నారు. మొదలు నాగరికత నదుల దగ్గర పుడితే, ఆ తర్వాత అరణ్యాల్లోనే వుండేదన్నారు. ఆ తర్వాత తెలివి వున్న వారు మైదానాల్లోకి వెళ్లారన్నారు. అడవులో నివసిస్తూ, అక్కడి వనరులను ఉపయోగిస్తూ, ప్రకృతికి నష్టం చేయకుండా వనవాసులు జీవిస్తున్నారన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో 70 తెగలు వున్నాయని అన్నారు. వనవాసులు కల్తీ కాలేదని, ముస్లింలు, ఆంగ్లేయులు వచ్చి దేశాన్ని ధ్వంసం చేశారన్నారు. అయినా వనవాసులు కల్తీ కాలేదన్నారు. అంతేకాకుండా బ్రిటీషు వారు ఈశాన్య రాష్ట్రాల్లో వున్న వారిని క్రైస్తవులుగా మార్చారని, అప్పట్లో అంత చైతన్యం వుండేది కాదని, వనరులు కూడా వుండేవి కావన్నారు. ఇప్పటికీ వనవాసులు వారి హక్కులకు భంగం కలిగితే ఏనాడూ ఊరుకోలేదన్నారు.
బిర్సాముండా జీవితం చాలా గొప్పదని, 25 సంవత్సరాల్లోనే గొప్ప పోరాటం చేశారన్నారు. అలాగే ఈ ప్రాంతంలో సమ్మక్క సారక్క కూడా పోరాటం చేశారన్నారు. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయి, దేవతలుగా కొనసాగుతున్నారన్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం కూడా చాలా పోరాటం చేశారన్నారు. భూమి మీద మొదట జన్మించిన వారంతా వనవాసులేనని, ఆ తర్వాత మైదానాల ప్రాంతాలకు వచ్చి, వ్యాపారాలతో ధనవంతులయ్యారన్నారు. ఇప్పటికీ వనవాసీ నాగరికతను కాపాడుకోవాలన్నారు. ఈ సంస్కృతి ప్రతి వారి రక్తంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత జనజాతీ గౌరవ దివస్ పేరుతో బిర్సాముండా జయంతి జరుపుతున్నారని, ఆ స్ఫూర్తి కొనసాగడానికే చేస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *