విజయవంతమైన PSLV -C60 ప్రయోగం
ఇస్రో పీఎస్ఎల్వీ సీ60 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో నుంచి సోమవారం రాత్రి 10 గంటల 15 సెకన్లకు పోలార్ శాటిలైట్ వెహికల్ సీ -60 నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్వీ బయల్దేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ -1బీ, 15.12 నిమిషాలకు స్పేడెక్స్ -1ఏ రాకెట్ నుంచి విడిపోయాయి. అంతరిక్షంలోనే ఉపగ్రహాలను డాకింగ్, అన్ డాకింగ్ చేసేలా శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ను ప్రయోగించారు. ఈ మేరకు స్పేస్ డాకింగ్ కోసం తొలి అడుగు పడినట్లైంది. ఈ మిషన్ లో భాగంగా చేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ6 రాకెట్ వాటిని జాగ్రత్తగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. ఇకఇక ఈ ప్రయోగంలో అసలు సిసలైన ఘట్టం.. డాకింగ్ (రెండు ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ) మిగిలి ఉంది.పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సోమవారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఆయన దర్శించుకొన్నారు. పూజలు చేశారు. అంతకుముందు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్రో అధికారులు పీఎస్ఎల్వీ-సీ60 నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వాస్తవానికి ఈ ప్రయోగాన్ని సోమవారం రాత్రి 9.58 నిమిషాలకే నిర్వహించాల్సి వుంది. కానీ అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా రెండు నిమిషాలు ఆలస్యంగా నిర్వహించారు. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 10:15 గంటలకు నింగిలోకి ఎగిరిన రాకెట్.. నిర్ణీత షెడ్యూలు ప్రకారం తొలి ఉపగ్రహాన్ని 15.10 నిమిషాలకు, రెండో ఉపగ్రహాన్ని 15.13 నిమిషాలకు భూమికి 476 కిలోమీటర్ల ఎత్తున, వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా విడిచిపెట్టింది. దీంతో మిషన్ కంట్రోల్ సెంటర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పేడెక్స్ మిషన్ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు.ఇక ఈ ప్రయోగంలో అసలు సిసలైన ఘట్టం.. డాకింగ్ (రెండు ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ) మిగిలి ఉంది. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాల్లో స్పేడెక్స్ కూడా వుంది. పీఎస్ఎల్వీ 420 కిలోల బరువు గల స్పేడెక్స్ అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రెండు ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను చేయడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యమని ఇస్రో పేర్కొంది.
ఈ ప్రయోగంతో భారత్ కి కలిగే లాభం ఇదీ…
డాకింగ్ అనే రెండు ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ అని అర్థం. సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటామని భారత్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి కూడా ఈ డాకింగ్ బాగా ఉపకరిస్తుంది. చందమామపైకి వ్యోమోగాములను పంపి, అక్కడి మట్టి ఇక్కడికి తేవాలన్నా, భవిష్యత్తులో చేపట్టే కీలక ప్రయోగాలకు అత్యంత కీలకం ఈ డాకింగే. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా అంతరిక్ష పరిశోధనల సంస్థల వద్ద మాత్రమే ఈ సాంకేతికత వుంది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే లక్ష్యంతో భారత్ గగన్‌యాన్ ప్రాజెక్టు చేపట్టనుంది. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి వాటిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అలాగే 2035 నాటికి సొంతంగా అతరిక్ష కేంద్రాన్ని నిర్మించే దిశగా ముందుకు సాగుతోంది. అయితే అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అవసరమైన వాటిని ఒకేసారి రాకెట్‌లో తరలించడం కుదరదు. కాబట్టి వాటిని విడతలవారీగా కక్ష్యలోకి చేర్చి వాటిని డాకింగ్ ద్వారా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఇలాగే ఏర్పాటుచేశారు. స్పేస్ స్టేషన్లకు వ్యోమగాములను, వస్తువులను తీసుకెళ్లే వ్యోమనౌకలను సైతం డాకింగ్ ద్వారానే అనుసంధానం చేస్తారు. అలాగే కక్ష్యలోని ఉపగ్రహాలకు మరమ్మతులు చేపట్టాలన్నా, ఇంధనం నింపాలన్నా, వాటిని ఆధునీకరించాలన్నా.. డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.