విద్యార్థుల్లో సంస్కారం నింపుతున్న శిశు మందిరాలు : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
సంస్కారం లేని చదువు చదువే కాదని, అదో సమాచారం మాత్రమేనని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మంచి వ్యక్తిత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, దేశభక్తి కోసం విద్య అని, అంతే తప్ప కెరీర్ కోసం విద్య కాదన్నారు. కేవలం కెరీర్ అనేదే విద్య లక్ష్యం కాదని పేర్కొన్నారు. మంచి వ్యక్తిత్వం, నైతిక విలువలు అన్నవి మాత్రమే వ్యక్తి లక్ష్యమని అన్నారు. బండ్లగూడ జాగీర్ లోని శారదాధామం ఆవరణలో వుండే విద్యారణ్య ఆవాస విద్యాలయం 41 వ వార్షికోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలు, సంస్కారం ఆధారంగా విద్యను అందించడంలో విద్యా భారతి, విద్యారణ్య ఆవాస విద్యాలయం ముందంజలో వున్నాయని ప్రశంసించారు.విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు దేశభక్తి, నైతిక విలువలను కూడా పెంపొందిస్తున్నాయన్నారు. అలాగే బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయన్నారు.
తెలంగాణలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో 200 పాఠశాలలు నడుస్తున్నాయని, విద్యార్థులు సంపూర్ణ వికాసం సాధించడంతో పాటు నైతిక విలువలను కూడా బోధిస్తున్నాయన్నారు. ధర్మం, బాధ్యత అనేది విద్య యొక్క సారమని భగవద్గీత బోధించిందన్నారు. ప్రతి మనిషి జీవితంలో తన విధులను నిర్వర్తించడానికి విద్య ఉపకరిస్తుందని పేర్కొన్నారు. భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానం గురించి కూడా మాట్లాడిందన్నారు.విద్య అంతిమ దశ ఆధ్యాత్మిక జ్ఞానమేనని, ఈ జ్ఞానమే తర్వాత మేధో జ్ఞానంగా రూపాంతరం చెందుతుందన్నారు. చదువు అంటే కేవలం సమాచార జ్ఞానమే కాదని, విలువల ఆధారంగా జీవించడం,ఆధ్యాత్మిక జ్ఞానం పొందడమేనని గీత చెబుతోందని వివరించారు.
GOVERNER2
ఆధునికంగా వచ్చిన చాలా విద్యాలయాలు ఆర్థికంగా సఫలం చెంది వుండొచ్చు కానీ… శ్రీ సరస్వతీ శిశు మందిరాలు మాత్రం దేశంలో సేవ చేయడంలో కృతకృత్యత సాధించాయని ప్రశంసించారు. దేశభక్తిని పెంపొందించడంలో, సంస్కృతిని కాపాడటంలో కూడా శిశు మందిరాలు విజయం సాధించాయన్నారు. శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంతో పాటు శ్రీ సరస్వతీ శిశు మందిరాలు సేవా బస్తీల్లో సంస్కార కేంద్రాలు నడుపుతూ పేద వారికి చదువు బోధిస్తూ, వారి అవసరాలు తీరుస్తున్నాయని అన్నారు. సంప్రదాయంగా వస్తున్న విలువలను కాపాడుతూనే.. ఆధునికతను కూడా శిశు మందిరాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ పద్ధతి కేవలం ఇక్కడే వుందన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లను మాత్రమే ఉత్పత్తి చేయడం విద్యాసంస్థల లక్ష్యం కాదని, ఉత్తమమైన, బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తయారు చేయడం కూడా విద్యా సంస్థల పనేనని అన్నారు.
ధర్మం కర్తవ్యం నైతికత వంటి విలువలతో కూడినదే అసలైన విద్య అని ఆయన స్పష్టంగా తెలియజేశారు. అదే స్ఫూర్తితో విద్యా భారతి , ముఖ్యంగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం శిశు మందిర్ స్కూల్స్ విద్యార్థుల సమగ్ర వికాసం కోసం కృషి చేస్తున్నాయని, అంతిమంగా విలువలతో కూడిన పౌరులను సమాజానికి అందిస్తున్నాయని కొనియాడారు. పుస్తకాల చదివితే సమాచారం మాత్రమే అందుతుందని, కానీ ఈ విద్యాలయాలు భావితరం నాయకులను తయారు చేస్తున్నయని, భారత సమాజం వికాసం కోసం కృషి చేస్తున్నాయిని ఆయన అభిప్రాయపడ్డారు.శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలోని పిల్లల నడవడిక, ఆచార్యుల ఆత్మీయ శిక్షణ, నాయకత్వం అందిస్తున్న ఆహ్లాదకరమైన వాతావరణం చూసి గవర్నర్ జిష్ణుదేవ వర్మ పులకించి పోయారు. ఆశువుగా సర్వ మంగళ మాంగల్యే ..అంటూ అనేక శ్లోకాల్ని ఆయన చదివి వినిపించారు. రూపం దేహి అంటే అంటే చక్కటి పౌరులు, జయం దేహి అంటే జాతి నిర్మాణంలో విజయం, యశోదేహి అంటే విశ్వ గురువుగా భారత్ కు కీర్తి ప్రతిష్టలు, ద్విషో జహి అంటే చీకట్లో తొలగిస్తూ దేశం ముందుకు సాగాలని, ఇందులో విద్యార్థులు యువత ముఖ్యపాత్ర పోషించాలని ఆయన అభిలషించారు. ప్రస్తుత భారతీయ సమాజం పెద్ద సంఖ్యలో యువతను నడిపించే పటిష్టమైన నాయకత్వాన్ని కలిగి ఉందని,, ఇది చరిత్రలో అరుదైన ఘట్టం అని ఆయన వివరించారు. శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం విద్యార్థులకు ఆచార్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు.