విమాన ప్రమాద దుర్ఘటన : తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. అలాగే బాధితులందరికీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు.
”గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదం చాలా దురదృష్టకరం. హృదయ పూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాం.మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ దు:ఖాన్ని భరించే శక్తి వారి కుటుంబాలకు ఇవ్వాలని ఈశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాం.ఓం శాంతి… ఓంశాంతి..’’ అని పేర్కొన్నారు.
అహ్మదాబాద్ లో మాటల కందని మహా విషాదం జరిగింది. గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఏఐ171 విమానం టేకాఫ్ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలింది. దీంతో 265 మంది దుర్మరణం పాలైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా వున్నారు. అయితే ఇంత దుర్ఘటన నుంచి ప్రాణాలతో ఒకే ఒక్క ప్రయాణికుడు బతికి బట్టకట్టాడు.