వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపేసిన అధికారులు
మాతా వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. వాతావరణ పరిస్థితిలో మార్పులేకపోవడంతో కొద్ది గంటల సేపు యాత్రను సస్పెండ్ చేయాలని శ్రీమాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు నిర్ణయించిందని అధికారులు తెలిపారు.
‘భక్తుల భద్రత మాకు చాలా ముఖ్యం. పరిస్థితులు మెరుగుపడగానే యూత్ర తిరిగి ప్రారంభమవుతుంది’ అని మందిర బోర్డు ప్రతినిధి తెలిపారు. కాగా, వదంతులు నమ్మవద్దని, మందిర బోర్డు అధికారికంగా ఎప్పటికప్పుడు విడుదల చేసిన సమాచారాన్ని పాటించాలని భక్తులను అధికారులు కోరారు.
మరోవైపు, కథువా, సాంబ, దోడా, జమ్మూ, రాంబాన్, కిష్ట్వార్ సహా జమ్మూలోని పలు ప్రాంతాల్లో వర్ష హెచ్చరికలు చేశారు. పలు చోట్ల నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండగా, చాలా ప్రాంతాల్లో వరదముప్పు నెలకొంది. చెనాబ్ నదిలో నీటి మట్టం పెరుగుతూ కొన్ని ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. ప్రజలు, మరీ ముఖ్యంగా నదీ పరిసర ప్రాంతాల వారు ఇళ్లలోంచి బయటకు వెళ్లవద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.