వ్యాపారానికి కూడా ధర్మమే మార్గదర్శనం : మోహన్ భాగవత్
ప్రపంచంలో ఆర్థికపరంగా వచ్చే హెచ్చుతగ్గులు భారత ఆర్థిక వ్యవస్థపై పరిమిత ప్రభావాన్నే చూపుతాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కొన్ని సార్లు సుంకాలు వంటి ఊహించని సవాళ్లు ఆర్థిక వ్యవస్ధను కాపాడుతున్నాయని, అదే దాని బలమని అన్నారు. బెంగళూరులోని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (BIEC)లో లఘు ఉద్యోగ్ భారతి కర్ణాటక, IMS ఫౌండేషన్ సహకారంతో 7వ ఎడిషన్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ షో – IMS2025 ని మోహన్ భాగవత్ సందర్శించారు.
గత 5-10 సంవత్సరాలుగా, MSME రంగం క్రమంగా అభివృద్ధి చెందుతోందని, అలాగే ప్రపంచ రంగంలో క్రమంగా పోటీగా కూడా మారుతోందన్నారు. ఆత్మ నిర్భర భారత్ అన్న దార్శనికతను క్షేత్ర స్థాయిలో నిజంగా సాకారం చేసుకోవడానికి సూక్ష్మ,చిన్న మధ్యతరహార పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమలులో వున్న ఆర్థిక వ్యవస్థ సహజంగానే సంపద, ఉత్పత్తి కేంద్రీకరణకు దారితీస్తుందని, అదే నమూనాను మనం అనుసరిస్తే ఉపాధి అవకాశాలు తగ్గుతాయని, ప్రజలు ఇతరులపై ఆధారపడతామని, పర్యావరణ ముప్పు కూడా పొంచి వుందని వివరించారు.
భారత సంప్రదాయంలో వ్యాపారం అనేది జీవనోపాధిని కల్పిస్తోందని, కానీ.. దీని సారంశం సేవే అని తెలిపారు. వ్యాపారానికి కూడా ధర్మమే మార్గనిర్దేశనం చేస్తోందని, సమాజం అభివృద్ధి చెందాలంటే, వ్యక్తులు సమిష్టి మంచికి బాధ్యత వహించాలని నమ్ముతామన్నారు.వ్యక్తి నుండి కుటుంబం వరకు, కుటుంబం నుండి సమాజానికి, సమాజం నుండి ప్రపంచం వైపు ఎదగాలని, మానవత్వం, సృష్టి ఒకదానితో ఒకటి అనుసంధానించబడే వుంటుందని, ఇదే భారతీయ ధృక్కోణం అని వివరించారు.