శంషాబాద్ లో హనుమంతుని దేవాలయంపై దాడి… విగ్రహాల ధ్వంసం

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే వున్నాయి. మొన్నటికి మొన్న సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి దేవాలయంపై దాడిని హిందువులు మరువక ముందే మరో దేవాలయంపై దాడి జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు కాలనీలోని హనుమాన్ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. దేవాలయంలోని నవగ్రహాల విగ్రహాలను ధ్వంసం చేశారు. ఉదయమే పూజల నిమిత్తం దేవాలయానికి వచ్చిన అయ్యప్ప స్వాములు ఈ విషయాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న భక్తులు, హిందూ సంఘాలు దేవాలయానికి చేరుకున్నాయి. కావాలనే దురుద్దేశంతో హిందూ దేవాలయాలపై ఛాందసులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా… రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేవలం హిందూ దేవాలయాలనే కొందరు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయంలో నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *