శివాజీ నిర్భీతి
భయం ఒక అదృశ్యశక్తి. అది చాలా రకాలుగా బయటపడుతూఉంటుంది.అందుకనే పతంజలి మహర్షి‘‘నిర్భయత్వం సన్యాసి లేదా సాధకుడి ముఖ్యలక్షణం’’అన్నాడు. శివాజీలో ఆ నిర్భయత్వం కనబడుతుంది. రాజాజయ సింగ్‌ను కలవడానికి వెళ్ళినప్పుడు ఒప్పందం ప్రకారం శివాజీ నిరాయుధుడై, కేవలం ఆరుగురు బ్రాహ్మణులను వెంటబెట్టుకుని వెళ్ళాడు. అప్పటికే జయసింగ్ ధాటికి పురందర్‌లో శివాజీ సైన్యం వెనక్కి తగ్గవలసి వచ్చింది కూడా. అటువంటి విపత్కర పరిస్థితిలో శివాజీ ఆరురోజులపాటు శత్రుశిబిరంలో ఉన్నాడు. అక్కడ తనకు ప్రాణాపాయం ఉందని బాగా తెలుసు.
అయినా అటువంటి పరిస్థితిలో కూడా శివాజీ తన ధైర్యాన్ని కోల్పోలేదు. పైగా అన్ని రోజులూ అక్కడే ఉన్న ఇటలీ రాయబారి నికోలై మంచుల్లీతో తుపాకీమందు, ఫిరంగుల తయారీవంటి విషయాలను అడిగి పూర్తిగా తెలుసుకున్నాడు. శివాజీ నిర్భీతి, కొత్త విషయాలపట్ల ఆసక్తిని చూసి నికోలై ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని తన డైరీలో ఇలా రాసుకున్నాడు ‘ప్రాణానికి హాని ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి కొత్తవిషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాడంటే అతనెంత నిర్భయుడో తెలుస్తుంది. శివాజీని చూస్తే నాకు ఆశ్చర్యమేసింది’. నిజమే నికోలై తన జీవితంలో మొట్టమొదటసారి ఒక నిజమైన రాజును చూసి ఉంటాడు.