శివ కుటుంబ మూలాలే హిందూ సారాంశం : ఇస్లామియా వీసీ మజర్ ఆసిఫ్
శివుడి వారసత్వం, హిందూ సంప్రదాయాలు భారతీయ సంస్కృతికి నిజమైన సారాంశాలని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ మజర్ ఆసిఫ్ అన్నారు.ఇందులో పొందుపరిచిన ఐక్యత, సోదరభావం, నైతిక విలువలును అందరూ స్వీకరించాలని పిలుపునిచ్చారు.శివ కుటుంబంలో వున్న మూలాలే హిందూ సంస్కృతికి నిజమైన సారాంశమని వివరించారు. వారణాసి కేంద్రంగా జరిగిన Purify Your Inner Soul in Lamahi, Varanasi అన్న కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వీటి విలువలు కేవలం భారత్ లోనే కాకుండా విశ్వవ్యాప్తమయ్యాయని, ప్రపంచంలోని వైరుధ్యాలకు, సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుందని ప్రకటించారు. కాశీగా అందరి నోళ్లల్లో నాణుతున్న వారణాసిలో సనాతన ధర్మం వెల్లివిరుస్తోందని, భారత దేశ సమగ్ర సామరస్య తత్వానికి కాశీ నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు.
భారత్ లో వున్న సోదరభావం, కలుపుగోలుతనం అన్న స్ఫూర్తిని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.అలాగే హిందువు ఆదర్శ హిందువుగా ఎలా నడుచుకోవాలో కూడా ఆయన వివరించారు. వాహనం నిలుపరాదు అన్న చోట్ల వాహనం పార్క్ చేస్తే హిందువు కాదని, ఇతరులను ఇబ్బంది పెడితే కూడా హిందూ లక్షణం లేదని అన్నారు.అలాగే పర్యావరణాన్ని కలుషితం చేస్తే కూడా హిందువు కాడని, హిందూ అనేది మతం కాదని, అదో క్రమశిక్షణ, గౌరవం, ప్రపంచం పట్ల బాధ్యతతో వుండే జీవన విధానమని వివరించారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు తామే అత్యుత్తమమని వారిది వారే చెప్పుకుంటారని మజీర్ ఆసిఫ్ ఎద్దేవా చేశారు. కానీ… ప్రతి రోజూ మానవత్వం పేరుతో ఎంత మారణకాండ జరుగుతుందో పరిశీలించాలని సూచించారు. భారతీయ సంస్కృతి ఇందుకు భిన్నంగా ఓ మార్గాన్ని అవలంబిస్తోందని ప్రశంసించారు. భిన్నత్వాన్ని గౌరవించడం, అందర్నీ కలుపుకోవడం, సామరస్యాన్ని అలవర్చుకోవడమే నిత్యం నేర్పిస్తోందన్నారు.
అలాగే ఆధునిక పోకడలను కూడా ఆయన ఎత్తి చూపారు. అత్యధిక విద్యావంతులు అనుకున్న వారే మోసం చేస్తున్నారన్నారు. ఈ ఆధునిక పోకడలను ఏమాత్రం అంటించుకోని గ్రామస్థులు మాత్రం నీతి, నిజాయితీ, సరళతో జీవిస్తున్నారన్నారు.