శ్రీ గురుగోవింద్ సింగ్
(జనవరి 5న జయంతి సందర్భంగా)
గురుగోవింద్ సింగ్‌గా ప్రసిద్ధమైన గోవింద రామ్ క్రీ.శ. 1666 జనవరి 5న పాట్నాలో గురుతేజ్ బహదుర్, మాతా గుజ్రి దంపతులకు జన్మించారు. గురునానక్, గురు అర్జున్‌దేవ్‌ల తర్వాత సిక్కు సంప్రదాదాయాన్ని అత్యంతంగా ప్రభావితం చేసినవాడు గురుగోవింద్ సింగ్. ఈయన సిక్కుల పదవ మరియు చివరి గురువు. ఇస్లాం మతం స్వీకరించనందుకు ఈయన తండ్రి గురుతేజ్ బహదుర్‌ని ఔరంగజేబు చంపించాడు. మహ్మ దీయుల దురాగతాల్ని ఎదుర్కొని, ధర్మాన్ని రక్షించటానికి సైనిక శక్తిని తయారు చేయాలను కొన్నాడు గురుగోవింద్. తన అనుచరులందరిని పేరు చివర పురుషులైతే సింగ్ (సింహం) అని, స్త్రీ లైతే కార్ (కుమారి) అని చేర్చుకోమన్నాడు.
పంచ ‘క’ కారాలు
గురుగోవింద్ సింగ్ పంచ ‘క’ కారాలను సిక్కులకు తప్పనిసరి చేశాడు. మొదటి ‘క’ కారం కేశాలకు సంబంధించినది. తలపై కాని, గడ్డంపై కానీ వెంట్రుకలు కత్తిరించరాదు. రెండవ ‘క’ ‘కంఘ’ ధారణ అంటే జుట్టులో ఎప్పుడూ దువ్వెన ఉండాలి. మూడవ ‘క’ ‘కభా’ అంటే పొట్టి నిక్కరు ధరించాలి. నాలుగవ ‘క’ ‘వడా’ కుడి మణికట్టుకు ఉక్కు కంకణాన్ని ధరించాలి. ఐదవ ‘క’ ‘కృపాణం’ ఆత్మరక్షణ కోసం కత్తి ఉంచుకోవాలి. గురు గోవింద్ నలుగురు కుమారులు కూడా ధర్మ రక్షణ కోసం బలిదానం అయ్యారు. అజిత్ సింగ్, జుజూర్ సింగ్ అనే ఇద్దరు కుమారులు యుద్ధరంగంలో మరణించారు. జోరావర్ సింగ్, ఫతేసింగ్ అనే మరో ఇద్దరు కుమారులు మొగలులచే హత్య కావించబడ్డారు.
1699 సంవత్సరం పంజాబ్‌లోని ఆనంద పూర్‌లో వైశాఖ పూర్ణిమ రోజున ‘ఖాల్సా’ పద్ధతిని ప్రారంభం చేసి ధర్మపరిరక్షణ కోసం తమ అంతిమ శ్వాస వరకు పోరాడతామని అందరితో ప్రతిజ్ఞ చేయించాడు. 1708 సంవత్సరం అక్టోబరు 7న గురుగోవింద్ సింగ్ నాందేడ్ సమీపంలో గోదావరి తీరాన తన శిబిరంలో ఉన్నపుడు, జంషెడ్‌ఖాన్ అనే మొగలు సైనికాధికారి కుయుక్తితో లోనికి ప్రవేశించి కత్తితో గుండెల్లో పొడిచి హత్య చేశాడు. గురుగోవింద్ సింగ్ మరణించిన తర్వాత ఆయన స్ఫూర్తితో ‘బందాసింగ్ బహదుర్’ మొగలులపై పోరాటాన్ని కొనసాగించాడు.