సంక్షోభంలోనూ స్వార్థప్రయోజనాలు?
ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో కొందరు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజల్ని ఆదుకోవడంలో కొన్ని రాష్టప్రభుత్వాలు విఫల మవుతున్న తరుణంలో సమస్య అంతా కేంద్ర ప్రభుత్వంలోనే ఉందంటూ ప్రచారం చేస్తుండడం విచిత్రం. ప్రభుత్వంపట్ల ప్రజల్లో అయోమయాన్ని, వ్యతిరేకతను కలిగించేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని గమనిస్తున్న ప్రజలు వివేకవంతంగానే వ్యవహరిస్తున్నారు. ఎక్కడా ఆందోళన చెందడం లేదు. మహారాష్ట్రలోని లాతూర్‌లో నీటికి తీవ్రమైన కొరత వచ్చినప్పుడు ప్రభుత్వం ఏకంగా రైలు ద్వారా అక్కడికి నీటిని తరలించింది. అలాగే ఇప్పుడు ఆక్సిజన్ అవసరాలను తీర్చేందుకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్‌ను తరలించింది. డిఆర్‌డిఓ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆసుపత్రులను దేశమంతటా నెలకొల్పుతోంది.
జనవరి నెలలోనే పిఎమ్ కేర్స్ ఫండ్ నుంచి ఆంధప్రదేశ్‌కు 5, మహారాష్ట్రకు 10, ఢిల్లీకి 8, తెలంగాణాకు 5 ఆక్సిజన్ ప్లాంట్లు కేటాయిస్తే ఇప్పటివరకూ ఆయా రాష్ట్రాలు కేవలం ఒక్కొక్క ప్లాంట్ మాత్రమే ఏర్పాటు చేసుకోగలిగాయి. ఆసుపత్రులలో సదుపాయాలు కల్పించడంలో కూడా శ్రద్ధ చూపించలేకపోయాయి. మరోవైపు కేంద్రానిదే తప్పని చూపే ఉద్దేశ్యంతో ప్రధానితో జరిగే ముఖ్య మంత్రుల సమావేశంలో లేనిపోని ఆరోపణలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ నిబంధనల్ని అతిక్రమించి ఆ కార్యక్రమాన్ని టివిలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిపై ప్రధాని తీవ్ర అభ్యంతరం తెలుపడంతో క్షమాపణలు చెప్పారు కూడా. వివిధ రాష్ట్రాల్లో హైకోర్టులు కూడా అక్కడి ప్రభుత్వాల పనితీరును పట్టిన సందర్భాలు ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దడం తమకు సాధ్యపడదని ప్రభుత్వం తేల్చిచెపితే ఈ విషయంలో జోక్యం చేసుకోవా ల్సిందిగా కేంద్రాన్ని కోరతామని ఢిల్లీ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. ఆ తరువాత లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు అప్పచెపుతూ కేంద్రం నిర్ణయం కూడా తీసుకుంది.
కోవిడ్ మొదటిదశలో అత్యవసరమందులు, వాక్సిన్‌లను అందజేయడం ద్వారా ఆదుకున్న భారత్‌కు ప్రపంచదేశాలన్నీ కృతజ్ఞత తెలిపాయి. ప్రస్తుత పరిస్థితిలో అవసరమైన సహాయం అందించడం ద్వారా భారత్ చేసిన సహాయా నికి ప్రతిస్పందించాలను కున్నాయి. అందుకు తగినట్లుగానే జర్మనీ, ఫ్రాన్స్ మొదలైన దేశాలు సహాయాన్ని అందిస్తున్నాయి. కానీ అమెరికా, చైనా వంటి దేశాలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాయి. మందుల తయారీకి అవసరమైన ముడిపదార్థాల సరఫరాను నిలిపివేశాయి. తరువాత అమెరికా తన తీరు మార్చుకున్నప్పటికీ చైనా మాత్రం సహకరించడానికి సిద్ధపడలేదు.
ఇటువంటి తీవ్ర, అత్యవసర స్థితిని ఎవరూ ముందుగా, పూర్తిగా అంచనా వేయలేరు. అయినా •కేంద్రం రెండు నెలల ముందే రాష్ట్రాలను హెచ్చ రించింది. ఇలాంటి దేశవ్యాప్త సమస్య వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దానికి అనుగుణంగా రాష్ట్రాలు తమతమ ప్రణా ళికలు రూపొందించుకుని అమలు చేయాలి. అప్పుడే సమస్య నుంచి సులువుగా బయట పడగలుగుతాం.
– హనుమత్‌ప్రసాద్