సంచార తెగల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ”విద్యా ప్రోత్సాహ కార్యక్రమం”
తెలంగాణ ప్రాంతంలోని సంచార తెగల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన విద్యా ప్రోత్సాహ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగింది. రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో సంచార తెగల కుటుంబ సభ్యులు, విద్యార్థులు, యువత, పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సంచార తెగల సంక్షేమ సమితి ఈ కార్యక్రమం ద్వారా తమ సామాజిక వర్గ యువతను విద్యలో ముందుకు నడిపించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా బెడబూడిగ జంగం, వీరభద్రీయ, బుడబుక్కల, వడ్డెర, జంగం, పెద్దమ్మల, మందుల తెగలకు చెందిన 65 మంది విద్యార్థులకు ఉత్తీర్ణత గుర్తుగా కాలేజ్ బ్యాగులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పీట్ల స్వర్ణ కుమార్ తన జీవితానుభవం వివరించారు.
“వడ్డెర తెగకు చెందిన కుటుంబంలో పుట్టి, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య చదువులో ముందుకు వెళ్లాను. విద్యతోనే మన సామాజిక పరిస్థితిని మార్చుకోవచ్చు” అని అన్నారు.ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు 1871 క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ వల్ల సంచార తెగలు ఎదుర్కొన్న వివక్ష, నేటికీ కొనసాగుతున్న అసమానతలను విశ్లేషించారు.
శ్రీమతి కోట అనిత గారు తన చదువు ప్రయాణాన్ని వెల్లడిస్తూ:
“నన్ను ఆరో తరగతి వరకు మాత్రమే చదివించారు. కానీ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం B.Ed పూర్తి చేశాను. ప్రస్తుతం LLB చివరి సంవత్సరం చదువుతున్నాను. నా లక్ష్యం, సంచార తెగలకు న్యాయపరంగా సేవ చేయడం” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మరో విశేషం ఏమిటంటే, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని అల్పాహారం, భోజనంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు పూర్తిగా తప్పించారు. వాటికి బదులుగా కాగితపు మరియు స్టీల్ పాత్రలను వినియోగించడం ద్వారా, సమాజంలో చక్కటి సందేశాన్ని ఇచ్చారు.

తెలంగాణ ప్రాంతంలోని అనేక జిల్లాల నుండి సంచార తెగల కుటుంబాలు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై విద్య ప్రాముఖ్యతను మరింతగా గ్రహించారు.కార్యక్రమంలో శ్రీ సువీర్ జీ, శ్రీ సిద్ధ రాఘవేంద్ర జీ, శ్రీ రెండ్ల శంకర్, పెద్దమ్మల అనిత గారు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.