​సంచార సింధువులు: సాంస్కృతిక స్రవంతికి జీవధాతువులు

వారు నిన్నటి చరిత్రకు నేటి వారసులు. తరాల సంస్కృతిని తమ గుండెల్లో దాచుకుని, తమ కాళ్ల కిందనే భారతావని చరిత్రను పరుచుకుంటూ నడిచిన జీవన శిల్పాలు.
సంచారులే… ఈ నేల పవిత్రతకు నిలువెత్తు సాక్ష్యాలు! సంస్కృతీ సంప్రదాయాల సమన్వయానికి, సమరస జీవనానికి వారధులు. వారు వెనకబడినవారనే మాట కేవలం సామాజిక అజ్ఞానం మాత్రమే. వారిని అర్థం చేసుకోక, వారి జ్ఞానాన్ని, కళా వైభవాన్ని చూడలేక… నిజానికి సమాజమే వెనకబడిపోయింది. ఈ నేల సంపదను, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ వచ్చిన ఈ మహనీయులను, క్రూరమైన బ్రిటిష్ పాలన ‘నేరస్థులు’గా ముద్రవేసింది. హిందుత్వపు ప్రాణాన్ని కాపాడుతూ వచ్చిన ఈ పవిత్ర ఆత్మలను, కాలక్రమంలో మన ఊరికి దూరం చేసుకున్నాం.
sanchara2
గజ్వేల్‌లో మేలుకొన్న పూర్వ వైభవం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో, శ్రీ సరస్వతి శిశు మందిర్ గ్రౌండ్స్‌లో అక్టోబర్ 26, 2025, ఆదివారం నాడు జరిగిన ‘విముక్త సంచార జాతుల కళా ప్రదర్శనలు’ ఒక అద్భుతం, ఒక భావోద్వేగ స్రవంతి. ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే… వందల ఏళ్ల చరిత్ర, సంస్కారం గాలిలో తేలియాడుతున్న అనుభూతి కలిగింది. ఆరు గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ యజ్ఞం, ఆహూతులకు ఆకలిని, దాహాన్ని మాత్రమే కాదు, తమ దైనందిన జీవితపు అలసటను సైతం మరిపింపజేసింది.
కన్నీళ్లు పలికిన కవిత్వం
​ఆ వేదికపై వెలసిన దృశ్యాలు… నటన కాదు, ఆత్మ నివేదన! బహు రూపులైన ఆ కళాకారులు రామాయణాన్ని ఆవిష్కరిస్తుంటే… రాముడు గుహుడిని ఆలింగనం చేసుకుని వెన్ను నిమిరే ఆ మైత్రికి, శబరి ఆప్యాయంగా పండ్లు తినిపించే ఆ మాతృత్వానికి… ప్రేక్షకుల కళ్లు కేవలం నిండలేదు, వారి హృదయాలు కవిత్వమై ద్రవించాయి.
sanchara23
అంతలోనే, భయంకరమైన కాళికా అమ్మవారి రాక్షస సంహార ఘట్టం. ఆ భీభత్సం భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తూనే, అంతిమ సత్యాన్ని, భక్తి తన్మయత్వపు శక్తిని ఒక్కసారిగా గుండెల్లో నింపింది.
సాంస్కృతిక రక్షణ కవచాలు
బుడబుక్కల వాళ్ళు శంఖం ఊదుతూ శైవ కథలు చెబుతుంటే, అది కేవలం భిక్షాటన కాదు… శివుడి సందేశాన్ని ఇంటింటికీ మోసుకెళ్లే ధార్మిక సేవగా అనిపించింది. చేతికొచ్చిన పంట దొంగల పాలు కాకుండా, మబ్బులోనే ఇంటింటినీ మేల్కొలిపే వారి గొంతుక… తరాల సంస్కృతికి రక్షణ కవచంలా వినిపించింది. రామాంజనేయ, సుదర్శన్ గోత్ర హోలియ దాసరులు, ధనంజయ వేషంతో వేసిన అడుగులు… పవిత్ర గ్రంథాల పరుగుల్లా తోచాయి.
విభూతి ధరించి పరమ శివుని ఆరాధించే మొండి వారు, ఔషధాలు అమ్ముతూ చిలక జోస్యం చెప్పే బుడగ జంగాలు, ఎరుక చెప్పే వాళ్లు, సోది చెప్పే వాళ్లు… వీరంతా తమ అజ్ఞాత జ్ఞానాన్ని, తరాల వైద్య రహస్యాలను ఒక కళారూపంలో వేదికపైకి తీసుకొచ్చారు.
sanchara234
వంశ చరిత్రకు వారసత్వం
​ప్రభలు తయారు చేసే వీర భద్రులు శివ దండకం చదువుతూ ప్రాంగణంలో ఊరేగుతుంటే… ఆ ప్రాంతమంతా కైలాసమైంది. వంశ రాజులు (పిచ్చికుంట్ల వారు) తమ పూర్వీకుల వంశాన్ని, ఇంటి చరిత్రను పూస గుచ్చినట్టు చెబుతుంటే… అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ తమ మూలాల చరిత్రను వెతుక్కున్నారేమో!
​కాటి పాపలు, గంగిరెద్దుల వాళ్ళు, చిందు భాగవత కళాకారులు… సుమారు 30 పైగా సంచార జాతుల నుంచి వచ్చిన 240 మంది కళాకారుల ప్రదర్శన… అది ఒక ఉత్సవం కాదు, ఒక చారిత్రక సదస్సు! పటం పెట్టి ఏకంగా భారతాన్నే చెప్పే ‘కాకి పడగల వారు’… ఆ వేదికను అక్షరాలా జీవన గ్రంథంగా మార్చేశారు.
​సమాజానికి సంస్కారపు భిక్ష
​మనిషి ప్రవర్తన నుంచి సమాజ నడవడిక వరకు… ఎంతటి లోతైన, జీవన సత్యాలనైనా కళా రూపంలో సులభంగా విప్పి చెబుతుంటే… పిల్లలు, పెద్దలు అలా నోళ్లు వెళ్ళబెట్టి విన్నారంతే. ఆ కళలో ఉంది.
sanchara2345
అనుభవం, ఆ మాటల్లో ఉంది సంస్కారం.
నక్కల వాళ్ళు… తమ జీవితంలో మొదటిసారి పాటలు పాడుతూ వేదిక ప్రదర్శన చేసి, స్వాభిమాన అనుభూతిని పొందారు. భిక్షుక వృత్తిలోనూ, పూసలు అమ్మడంలోనూ, బుట్టలు అల్లడంలోనూ… వారు అంటిపెట్టుకున్న ఆత్మగౌరవం అద్భుతం!
ఒక అంచనాగా తెలంగాణాలో 70 కి పైగా ఉన్న ఈ సంచార జాతులు… తమ పుట్టుకలో, వివాహంలో, చివరికి చావులో కూడా సమాజాన్ని అంటిపెట్టుకుని… ఆశ్రిత కులాలుగా కుదించుకుని కూడా, తమ సంస్కారపు వెలుగును మాత్రం ఆర్పివేయలేదు.
sanchara234567
​గొప్పదనం సవాల్ చేసిన మహిళామూర్తి
ఈ కార్యక్రమానికి వచ్చిన వందల మంది, కార్యక్రమం పూర్తయ్యే వరకూ అన్నపానాదులు మర్చిపోయి, ఈ అలౌకిక ఆనందంలో మునిగిపోయారు. రాజకీయ నాయకులు ఓట్లు వేసే మర మనుషులుగా చూసిన ఈ అమాయక ప్రజలను, ప్రభుత్వాలు అసలు మనుషులుగానే గుర్తించలేదు. కానీ, వారిలో మిగిలి ఉన్న స్వచ్ఛమైన కల్మషం లేని అమాయకత్వం, మంచి సంస్కారవంతమైన భాష… ఈ సమాజానికి ఒక పాఠం.
​అంతేకాదు, ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ… ఆధునిక వైద్యానికే సవాల్ విసిరిన ఆదిలాబాద్ గోండు మహిళ యమునా బాయి! 1500కు పైగా సాధారణ కాన్పులు చేసి, చదువురాని ఆ మహిళ, స్త్రీ సాధికారత, భగవంతుడి పట్ల నమ్మకం, సంకల్ప శక్తి గురించి చెబుతుంటే… పురజనులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
​చివరికి చెప్పే ఒక్క మాట: సమాజం వీళ్ళకి భిక్ష వేయలేదు… సమాజానికి ఈ సంచార జాతులే సంస్కారపు భిక్ష వేశాయి!
sanchara23456
వీరే… హిందుత్వాన్ని కాపాడుతున్న నిజమైన దేశ భక్తులు!
మంగళంపల్లి శ్రీహరి, రాష్ట్ర సమరసతా కళా విభాగం సహ సంయోజకులు అందించిన ఈ అక్షరరూపం, వారి పట్ల మనకుండాల్సిన రుణాన్ని, గౌరవాన్ని గుండెల్లో నింపుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *