సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగ జంగాలు : అప్పాల ప్రసాద్
హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే జాతి బేడ బుడగ జంగాలని, సంస్కృతి పరిరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి వుండాలని సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు.జగిత్యాల సామాజిక సమసత వేదిక ఆధ్వర్యంలో బేడ బుడగ జంగాల కాలనీలో గాయత్రి మహా యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుడగ జంగాలకు చెందిన కుటుంబాలు పెద్ద ఎత్తున యజ్ఞంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ బేడ బుడగజంగాలు శివ భక్తులని, శివ తత్వాన్ని, రామాయణ, భారత కథలను బుర్రకథ రూపంలో గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడంలో బుడగ జంగాల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. బుడగ జంగాలలోని పేద రికాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని శక్తులు ప్రలోభాలకు గురిచేసి మతమార్పిడులకు పాల్పడుతున్నాయని,దీంతో వారి అస్తిత్వాన్ని కోల్పోయి సంస్కృతికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీరికి MRO ద్వారా సర్టిఫికెట్స్ అందని కారణంగా ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు.ఈ వర్గాల పట్ల నిర్లక్ష్యం కారణంగా విద్య అందక పిల్లలు యువకులు కూడా మధ్యలోనే చదువులు మానేస్తున్నదుస్థితి వుంది. అలాగే డబుల్ బెడ్ రూమ్ లు అందని వారెందరో వున్నారు.పెన్షన్ కూడా లభించని వృద్దులు వున్నారు. తమ కాలనీలో ఇంత పెద్ద ఎత్తున గాయత్రి యజ్ఞాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పాల్గొనే విధంగా చేయడం ఎంతో సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కాలనీవాసులు కోరారు.