సమోసా, జిలేబీపై హెచ్చరికలన్న వార్తలు శుద్ధ తప్పు : కేంద్రం క్లారిటీ
సమోసా, జిలేబీ లాంటి ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తేలింది. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. సిగరెట్ పెట్టెలపై ఉన్నట్లుగా హెచ్చరికలు వుంచాలని కేంద్రం నిర్ణయించిందనడంలో వాస్తవం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకటించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే సాధారణ ఆరోగ్య సలహా మాత్రమేనని కేంద్రం తెలిపింది.
రోడ్ సైడ్ ఫుడ్ ని మేము లక్ష్యంగా చేసుకోలేదు. విక్రయించే ఆహార ఉత్పత్తుల్లోని చక్కెర, నూనె శాతాలను పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు పెట్టాలని నిర్దేశించలేదు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఏ ఆహార పదార్థాలనూ పేర్కొనలేదు’’ అని కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రజల మెరుగైన ఆహారాన్ని జీవనశైలిని ప్రోత్సహించేందుకు కేంద్రం సాధారణ ఆరోగ్య సలహా ఇచ్చిందే తప్పించి, ఏ ఆహార పదార్థాలనూ ప్రస్తావించలేదని కేంద్రం స్పష్టతనిచ్చింది.