సార్వత్రిక సమ్మెకు దూరం : BMS కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ చర్యల్ని వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు తాము దూరంగా వుంటామని భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రకటించింది. ఈ సమ్మెలో తాము పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామని బీఎంఎస్ నేత రవీంద్ర హిమాటే తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 2019, 2020 లో నాలుగు కొత్త కార్మిక చట్టాలను తీసుకొచ్చింది.
వేతనాల కోడ్ 2019, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్, 2020
– పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020 ని రూపొందించింది.
అయితే బీఎంఎస్ మాత్రం వేతనాల కోడ్ 2019, సామాజిక భద్రత కోడ్ 2020 ని స్వాగతించింది. ఇది అత్యంత చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వేతనాలను నిర్ణయించడానికి ఓ చట్టబద్ధ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వుంటుంది. అలాగే కనీస వేతనాలను నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారం ఇస్తుంది. అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకు కనీస వేతనాన్ని పెంచే నిబంధనను కూడా కేంద్రం అందులో నొక్కి చెప్పింది. గతంలో షెడ్యూల్డ్ ఉద్యోగాలలోని కార్మికులకు మాత్రమే కనీస వేతనాలు లభించేవి. కానీ కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టంలో మాత్రం 8 గంటలు పనిచేసే ప్రతి కార్మికుడి శ్రమతో సంబంధం లేకుండా కనీస వేతనాలకు అర్హులవుతారు.
ఇక… సామాజిక భద్రత కోడ్ 2020 ప్రకారం మొదటిసారిగా గిగ్, ప్లాట్ ఫామ్ పై వుండే కార్మికులకు కూడా సామాజిక భద్రత వస్తుంది. గతంలో ఓ కార్మికుడు యజమాని ద్వారా ESIC కి నిర్దేశించిన మొత్తాన్ని జమ చేయకపోతే.. అనారోగ్యం, లేదా ప్రమాదాలు సంభవించిన సమయంలో వారు ESIC ఆస్పత్రులలో చికిత్స పొందేందుకు ఏమాత్రం అర్హులే కాదు. కానీ కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం సంబంధిత యజమాని జమ చేయకపోతే.. కార్మికుడు చికిత్స పొందడానికి అర్హత మాత్రం వుంటుంది. ఇది అత్యంత ప్రగతిశీల చర్యగా కార్మిక నేతలు చెబుతున్నారు.
వీటన్నింటి కారణాల వల్ల భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ రెండింటికీ మద్దతిస్తూ….మిగిలిన వాటికి కొన్ని సవరణలను ప్రతిపాదించింది. వాటాదారులందరితోనూ చర్చించే ఈ ప్రతిపాదనలు చేసింది. అయితే కొన్ని కార్మిక సంఘాలతో ప్రభుత్వం ఈ మధ్యే చర్చలు జరిపింది. కానీ ఈ చర్చలు సరిపోవన్నది కొందరి అభిప్రాయం. కార్మికులకు ఉపయోగ పడే విధంగా కేంద్రం చట్టాలు తీసుకొచ్చినా.. కొన్ని కార్మిక సంఘాలు పనికట్టుకొని, రాజకీయం చేస్తున్నాయి. ఇవ్వాళ (జూలై 9) న దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కి పిలుపునిచ్చాయి. ఈ కారణాల వల్లే తాము ఈ సమ్మెకు దూరంగా వుంటున్నామని బీఎంఎస్ ప్రకటించింది.