స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం.. నాలుగో దేశంగా భారత్
గత కొన్నేళ్లుగా అంతరిక్షంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 2025 ఏడాదిలో తొలి విజయాన్ని అందుకుంది. గతేడాది చివర్లో నింగిలోకి పంపించిన స్పెడెక్స్ ప్రయోగానికి సంబంధించి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయినట్లు స్వయంగా ఇస్రో ట్విటర్‌లో వెల్లడించింది.
ఇక అంతరిక్షంలో శాటిలైట్లను అనుసంధానం చేయడం చాలా క్లిష్టమైన పని కాగా ఇప్పటివరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే.. ఈ ఘనతను సాధించాయి. తాజాగా ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఆ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.ఇది ఒక చరిత్రాత్మక క్షణం అని ఇస్రో పేర్కొంది. 15 మీటర్ల నుంచి 3 మీటర్ల హోల్డ్ పాయింట్ వరకు ఈ డాకింగ్ పూర్తి అయినట్లు ప్రకటించింది. అత్యంత ఖచ్చితత్వంతో డాకింగ్ ప్రక్రియను ప్రారంభించగా, అది విజయవంతంగా అనుసంధానం అయిందని పేర్కొంది.
ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో ప్రపంచంలోనే ఇలాంటి స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించినట్లు ఇస్రో వెల్లడించింది. భారత్ కంటే ముందు చైనా, రష్యా, అమెరికా దేశాలు స్పేస్ డాకింగ్‌లో విజయవంతం అయ్యాయి. ఈ సందర్భంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ఇస్రో టీమ్‌కు, దేశానికి ఇస్రో శుభాకాంక్షలు తెలిపింది.
దేశ అంతరిక్ష సామర్థ్యాలను పెంపొందించినందుకు ఇస్రో, దాని శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. రెండు ఉపగ్రహాలను విజయవంతంగా డాకింగ్ చేయడంతో భారతదేశ అంతరిక్ష కార్యక్రమం చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని రాష్ట్రపతి కొనియాడారు.
“స్పేస్ డాకింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించిన నాల్గవ దేశం భారతదేశం. ఈ విజయం చంద్రయాన్-4, భారతదేశ ప్రణాళికాబద్ధమైన అంతరిక్ష కేంద్రం, గగన్‌యాన్ వంటి అంతరిక్ష పరిశోధనలో భారతదేశ భవిష్యత్ ప్రయత్నాలకు మార్గం సుగమం చేస్తుంది” అని ఆమె ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, అంతరిక్ష సాంకేతికతలో గణనీయమైన మైలురాయిని సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను కూడా అభినందించారు.
ఇస్రో 2024 డిసెంబర్ 30న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శాస్త్రవేత్తలు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60 (పీఎస్ఎల్వీ-సీ60) వాహననౌక ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను పీఎస్ఎల్వీ-సీ60 విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
అనంతరం SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) ఉపగ్రహాలను రోదసిలో వాటిని అనుసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఉపగ్రహాలను తాజాగా విజయవంతంగా అనుసంధానం చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవతంగా పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది.