హర్యానాలో పెరిగిపోతున్న బంగ్లా అక్రమ చొరబాట్ల సమస్య.. ఆధారాలు చూపిస్తున్నా మౌనంగా ఉన్న ప్రభుత్వం
సంతాల్ పరగణా ప్రాంతంలో బంగ్లాదేశీయుల చొరబాట్లను అరికట్టాల్సిందేనని ఇటీవలే జార్ఖండ్ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. దీంతో మరోసారి దేశ వ్యాప్తంగా అక్రమ చొరబాటుదారుల సమస్య వెలుగులోకి వచ్చింది. పరగణా ప్రాంతంలో వున్న అక్రమ చొరబాటుదార్లను గుర్తించి, వారిని తిరిగి బంగ్లాకి పంపించేయాలని, దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది కూడా. దీనిపై రెండు వారాల్లోగా తమకు పురోగతిపై నివేదిక కూడా సమర్పించాలని కూడా ఆదేశించింది.
అయితే.. ఈ విషయం లో హర్యానా అంతగా వార్తల్లోకి ఎక్కలేదు. కానీ.. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా అధిక సంఖ్యలో అక్రమ చొరబాటుదారులు వున్నట్లు తేలింది. రాష్ట్రంలోని నుహ్, యమునానగర్, పానిపట్, భివానీజింద్, గురుగ్రామ్ మరియు ఫరీదాబాద్ జిల్లాల్లో బంగ్లా చొరబాటుదారులు అధిక సంఖ్యలో వున్నారు. వుండటమే కాకుండా ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు కూడా కలిగి వున్నారు.
అయితే.. అక్రమ చొరబాటుదార్ల విషయంలో హర్యానా హోంశాఖ లెక్కలు తేల్చే పనిలో వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 500 మంది బంగ్లా అక్రమ చొరబాటుదార్లు హర్యానాలోనే వున్నట్లు గుర్తించారు. నుహ్ లో జరిగిన హింసలో వీరి పాత్ర స్పష్టంగా వుందని విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలు పదే పదే ఆరోపిస్తున్నాయి. వీటికి సంబంధించిన సాక్ష్యాలను కూడా సమర్పించింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ వారు అన్ని ఆధారాలు సమర్పించినా… అక్రమ చొరబాటుదార్లని గుర్తించే విషయంలో వస్తున్న ఇబ్బందులు ఏమిటో అర్థం కావడం లేదు. అయితే.. జింద్, నార్నాల్ జిల్లాల్లో మాత్రం అక్రమ చొరబాటుదార్లను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అంతేకాకుండా జింద్ జిల్లాలోని పజుఖుర్దలో 10 మంది బంగ్లాదేశీయులను, పానిపట్‌లో నలుగుర్ని అరెస్ట్ చేశారు. వీరిలో చాలా మంది ఇటుక బట్టీలు, బ్లీచింగ్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. వీధి వ్యాపారులుగా కూడా వున్నట్లు తేలింది.
అక్రమ చొరబాటు దార్లపై తీవ్రంగా స్పందించిన జార్ఖండ్ హైకోర్టు
జార్ఖండ్‌లోని సంతాల్ పరగణా ప్రాంతంలో బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లు సమస్యగా మారింది. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ చొరబాట్లను అరికట్టాలని, వారిని తిరిగి బంగ్లాకు పంపించేందుకు ప్రభుత్వం ఓ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన పురోగతితో కూడిన నివేదికను రెండు వారాల్లోగా తమకు సమర్పించాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రాష్ట్రంలో వుంటూ అన్ని సౌకర్యాలను పొందుతున్నారని, వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరోధించాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. ఇది కేవలం ఈ రాష్ట్రానికో, జిల్లాకో సంబంధించిన సమస్య కాదని, దేశానికి సంబంధించిన సమస్యగా హైకోర్టు స్పష్టం చేసింది.