హెడ్గేవార్ ప్రతిపాదించిన ఐక్యతా సందేశం నేటికీ సందర్భోచితం : గవర్నర్ రాధాకృష్ణన్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ ప్రతిపాదించినఐక్యతా సందేశం నేటికీ సందర్భోచితమని మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. మహారాష్ట్ర రాజభవన్ లో సచిన్ నంద రచించిన Hedgewar A Definitive Biography’ అన్న పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ రాధాకృష్ణన్ రచయితను అభినందించారు. సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయవాద సంస్థగా అవతరించిందని గవర్నర్ పేర్కొన్నారు.
సంఘ్ తన వందేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే దేశభక్తులను తయారు చేసిందని, అలాగే దేశం కోసం తృణప్రాయంగా తమ ప్రాణాలను వదిలేసే వారిని కూడా దేశానికి అందించిందన్నారు. ఈ సందర్భంగా తనకు ఆరెస్సెస్ తో వున్న సంబంధాన్ని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా తిరుపూర్ కేంద్రంగా తాను చేసిన సంఘ కార్యాన్ని ప్రస్తావించారు.సాంస్కృతికంగా, సంప్రదాయంగా కూడా భారత్ ఎప్పుడూ ఒకే దేశమని స్పష్టం చేశారు.
ఇక.. రచయిత సచిన్ నందా కూడా మాట్లాడారు. ఈ పుస్తకావిష్కరణ తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డాక్టర్ హెడ్గేవార్ అంతర్జాతీయ చిహ్నంగా మారుతారని తెలిపారు. హెడ్గేవార్ ప్రతిపాదించిన తత్వం, కార్యపద్ధతి, ఆయన దృష్టికోణాన్ని ఈ పుస్తకం ఆవిష్కరిస్తుందని రచయిత తెలిపారు.