దేవాలయాలపై రాష్ట్ర నియంత్రణను ఎత్తివేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
ఉత్తరాఖండ్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న 51 హిందూ దేవాలయాలను ప్రభుత్వ నిర్వహణ నుంచి తొలగిస్తూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ నిర్ణయం తీసుకున్నారు.
హరిద్వార్‌లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) జాతీయ స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు తీర్మానాలపై చర్చించారు. ‘రామ్‌సేతు’ను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేయాలని సభ్యులు తీర్మానం చేశారు. మతమార్పిడి వ్యతిరేక చట్టాలను ప్రతీ రాష్ట్రంలో తీసుకువచ్చేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తొలగించాలని సభ్యులు డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి హాజరైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ దేవాలయాల నిర్వహణ, నియంత్రణ కోసం ‘దేవస్థానం చట్టం’ నుండి దేవాలయాలను బయటకు తీసుకురావడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సభ్యులకు హామీ ఇచ్చారు.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు సందర్శించే పుణ్యక్షేత్రాల నిర్వహణకు ఈ కొత్త చట్టం సహాయపడుతుందని ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ చెప్పారు. 2019లో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన దేవాలయాలను సుమారు 30లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు.
ఈ చట్టం ప్రకారం, ముఖ్యమంత్రి బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సీనియర్ ఐ.ఎ,ఎస్ అధికారి ఒకరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉంటారు. అయితే గత ముఖ్యమంత్రి దేవాలయాల నిర్వహణ ప్రభుత్వం తీసుకోవాలన్న నిర్ణయాన్ని ప్రస్తుత సీఎం తప్పుబట్టారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆమోదించిన చార్ ధామ్ దేవస్థానం మేనేజ్మెంట్ బిల్లుకు గవర్నర్ బేబీరాణి మౌర్య ఆమోదం పొందిన తర్వాత బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి సహా 51 మందిరాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణ లోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో హిందూ దేవాలయాను ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటికి తీసుకు రావాలని జరుగుతున్న ఉద్యమానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.