బ్రిటన్‌లో జాతి వివక్షపై కచ్చితంగా స్పందిస్తాం: భారత్
బ్రిటన్‌లో పెరుగుతున్న జాత్యహంకార చర్యలపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సరైన సమయంలో కచ్చితంగా చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేసింది. బ్రిటన్‌లో జాత్యహంకార చర్యలపై సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ అశ్విని వైష్ణవ్ అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఇటీవల ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన రష్మి సమంత్ ఎన్నికైన నేపథ్యంలో అక్కడి జాత్యంహకార చర్యల వల్ల, భారతీయత, హిందూ మత విశ్వాసాల పట్ల సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం కావడం వల్ల ఆమె స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని, ఇటువంటి సంఘటనల పట్ల భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుటుందని ఎంపీ అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన మంత్రి జై శంకర్ మాట్లాడుతూ ‘‘జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీజీ పుట్టిన దేశం భారతదేశం అని, జాత్యహం కారానికి భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. బ్రిటన్‌లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడూ గమనిస్తున్నామని, సరైన సమయంలో కచ్చితమైన చర్యలు తీసుకుంటా మని ఆయన తెలిపారు. జాత్యహంకారం, ఇతర రకాల అసహనాలపై భారత్ ఎప్పుడూ పోరాడు తోందని ఆయన అన్నారు.
‘‘కర్ణాటకలోని ఉడిపికి ప్రాంతానికి చెందిన రష్మీ సమంత్ ఎన్నో సవాళ్లను అధిగమించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సీటీలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయింది. కానీ అక్కడి ప్రజలు వివక్ష చూపడంతో, ముఖ్యంగా యూనివర్సిటీకి చెందిన అధ్యాపక సభ్యుడు ఒకరు ఏకంగా ఆమె తల్లి దండ్రుల హిందూ మత విశ్వాసాలను కించ పరిచినట్టూ బహిరంగంగానే పలు వ్యాఖ్యానాలు చేశాడు, సోషల్ మీడియాలో ఆమె పట్ల ఆసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్ వంటి యూనివర్సీటీల్లో కూడా ఒక భారత మహిళ జాతి వివక్షకు గురవడం చూస్తే.. బ్రిటన్ వంటి దేశం ప్రపంచానికి ఎటు వంటి సందేశాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవాలని, జాత్యహంకారం ఏ స్థాయిలో పెరిగిపోయిందో స్పష్టం అవుతోంది అని ఎంపీ అశ్మిని వైష్ణవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘బ్రిటన్ యువరాజు హారీ భార్య మేఘాన్ కూడా జాతి వివక్షకు గురైందని, సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వారిపైనే జాతి వివక్ష పాటిస్తే, కింది స్థాయిలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ’’అని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు ఘటనలు వేరుకావని బ్రిటన్‌లో పెరిగిపోతున్న జాత్యహంకారంపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
అలాగే ఇటీవల భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై, లండన్‌లోని కొన్ని ఖలిస్తానీ గ్రూపుల ఒత్తిడితో, బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చించడం పట్ల భారత్ తీవ్ర స్థాయిలో ఆసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై బ్రిటన్ హై కమిషనర్‌ను వివరణ కోరింది కూడా.