10 ఉపగ్రహాలు 24 గంటలూ దేశాన్ని పహారా కాస్తున్నాయి : ఇస్రో చైర్మన్
పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సరిహద్దులు తీరప్రాంతాన్ని పర్యవేక్షించడానికి, రక్షించడానికి 10 భారతీయ ఉపగ్రహాలు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ అన్నారు. కీలకమైన నిఘా డేటాను అందించడం ద్వారా పౌరులను రక్షించడంలో ఈ ఉపగ్రహాలు వ్యూహాత్మక పాత్ర పోషిస్తాయని తెలిపారు.మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (CAU) 5వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ.. భారతదేశపు 7,000 కిలో మీటర్ల సముద్ర తీరం, ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం గురించి ఆయన వివరించారు.
“మన దేశ భద్రతను నిర్ధారించుకోవాలంటే, మన ఉపగ్రహాల ద్వారా సేవలందించాలి. మన సముద్ర తీర ప్రాంతాలను మనం పర్యవేక్షించాలి. మనం మొత్తం ఉత్తర భాగాన్ని నిరంతరం పర్యవేక్షించాలి” అని నారాయణన్ అన్నారు. శాటిలైట్లు, డ్రోన్ టెక్నాలజీ లేకుండా భారతదేశం పూర్తి భద్రతా కవరేజీని సాధించలేమని నారాయణన్ స్పష్టం చేశారు.