16 వేల మంది విదేశీయులను బహిష్కరించేందుకు సన్నాహకాలు
దేశం నుంచి 16 వేల మంది విదేశీయులను బహిష్కరించడానికి కేంద్రం రెడీ అవుతోంది. దేశంలో ఇటీవలే అమలులోకి వచ్చిన నూతన వలస చట్టాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాలతో సంబంధమున్న దాదాపు 16 వేల మంది విదేశీయులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వీరందరూ నిర్బంధంలోనే వున్నారు. వీరందర్నీ దేశం నుంచి బహిష్కరించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది.
అయితే ఈ 16 వేల మంది జాబితాను ఇప్పటికే హోంశాఖ సంబంధిత సంస్థలకు కూడా అందించింది. మరో వైపు మన దేశంలో అక్రమంగా నివాసం వుంటున్న విదేశీయులకు కఠిన శిక్షలు విధించే కొత్త చట్టం సెప్టెంబర్ 2 న అమలులోకి వచ్చింది. దీని ప్రకారం తప్పుడు పత్రాలతో దేశంలోకి వచ్చిన విదేశీయులకు కనిష్టంగా రెండేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష వుంటుంది. అలాగే లక్ష నుంచి పది లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు.