2027 లో చంద్రయాన్ -4.. కేంద్రమంత్రి ప్రకటన
చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు ఇస్రో చంద్రయాన్ 4 ప్రయోగాన్ని 2027 లో చేపడుతున్నట్లు కేంద్ర శాస్త్ర,సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. అందులో భాగంగా ఎల్వీఎం3 రాకెట్ ను కనీసం రెండు సార్లు ప్రయోగించి, చంద్రయాన్ 4 మిషన్ కి సంబంధించిన ఐదు భిన్నమైన భాగాలను నింగిలోకి పంపిస్తామన్నారు.
చంద్రయాన్-4 మిషన్‌ను ప్రయోగిస్తుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ ప్రయోగంలో చంద్రుడి నమూనాలను భూమిపైకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ చంద్రయాన్-4 మిషన్‌లో ఎల్‌వీఎం 3 రాకెట్ వేర్వేరు ప్రయోగాల తర్వాత.. 5 వేర్వేరు భాగాలను నింగిలోకి మోసుకువెళ్లి.. అక్కడే స్పేస్‌లో అనుసంధానించనున్నట్లు జితేంద్ర సింగ్ తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై ఉండే నమూనాలను సేకరించి.. తిరిగి భూమికి చేరుకోవడమే చంద్రయాన్-4 మిషన్ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇక వచ్చే ఏడాది గగన్‌యాన్ మిషన్‌ను ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగాములను భూమి దిగువ కక్ష్య వరకు పంపించి.. తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. గగన్‌యాన్ ప్రాజెక్టు మానవరహిత మిషన్ అని.. ఇందులో వ్యోమ్ మిత్ర రోబోను కూడా పంపించనున్నట్లు పేర్కొన్నారు.