ఛత్తీస్ గఢ్ లో ‘‘లొంగుబాటు పర్వం’’.. 22 మంది మావోల లొంగుబాటు
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతూనే వుంది. తాజాగా నారాయణపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులు శుక్రవారం నాడు లొంగిపోయారు.అబూజ్‌మడ్ ప్రాంతల్లో చురుకుగా ఉన్న వీరంతా నారాయణపూర్ ఎస్పీ రాబిన్‌సన్ గిరియా, సీనియర్ పోలీసు అధికారుల సమక్షంలో లొంగిపోయారు. వీరిలో 14 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. వీరిలో ఒక జంట కూడా ఉంది. అలాగే ఏరియా కమిటీ కమాండర్ కూడా వున్నాడు. కుతుల్, ఆమ్‌దయీ ఏరియా కమిటీలకు చెందిన ఈ సభ్యులు బస్తర్ ప్రాంతంలోని అటవీ జోన్లలో చిరకాలంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.37 లక్షల రివార్డు ఉంది.
హింసను వీడి ప్రగతి మర్గాన్ని ఎంచుకుంటూ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. లొంగిపోయిన 22 మంది నక్సలైట్లపై రూ.37.5 లక్షల రివార్డు ఉందని చెప్పారు. వీరిలో రూ.50,000 నుంచి రూ.8 లక్షల వరకూ రివార్డు ఉన్న వారున్నారని చెప్పారు. వీరంతా ఇప్పుడు మిలిటెన్సీకి దూరంగా జనజీవన స్రవంతిలోకి వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. ఇంతవరకూ 1,476 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయారని, 2025లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పునరావాస విధానం, సంక్షేమ చర్యలతో గిరిజనుల్లో విశ్వాసాన్ని చూరగొన్నామని చెప్పారు.