వారణాసిలో తెరుచుకున్న 250 ఏళ్ల నాటి దేవాలయం
మొన్న సంభాల్ లో పురాతన ఆలయం బయటపడింది. విగ్రహాలు కూడా కనిపించాయి. అది మరిచిపోక ముందే యూపీలోని వారణాసి జిల్లా మదన్ పురా పట్టణంలో పురాతన ఆలయం మళ్లీ తెరుచుకుంది. ఈ ఆలయం 250 ఏళ్ల పురాతన ఆలయమని స్థానికులు తెలిపారు. కానీ 10ఏళ్లుగా ఈ ఆలయం మూతపడే వుంది. ఇప్పుడు ఇది తెరుచుకుంది. దీనికి సంబంధించిన సమాచారం బయట పడటంతో సనాతన రక్షక దళ్ సభ్యులు దేవాలయం దగ్గరికి చేరుకున్నారు. ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతం కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అయితే.. ఈ ప్రాంతంలో ఒకప్పుడు హిందువులు అధికంగా వుండేవారని సనాతన రక్షక్ దళ్ పేర్కొంది.కానీ క్రమంగా ముస్లింలు భూమి, ఇళ్లు కొనడం ప్రారంభించారు. ముస్లిం వర్గానికి చెందిన వారు పెరిగిపోవడంతో హిందువులు ఇతర ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే తాళం ఎవరు వేశారన్నది మాత్రం తెలియడం లేదు. గుడి లోపలి భాగం మొత్తం మట్టితో నిండిపోయింది. అయితే ఈ గుడి పేరు సిద్ధిప్రద సిద్ధేశ్వరాలయం అని చెప్పబడుతోంది. దీని దగ్గర ఓ బావి కూడా వున్నట్లు చెబుతున్నారు. అలాగే ఈ ఆలయం ప్రాశస్త్యం కాశీఖండంలో కూడా వుందని పురోహితులు చెబుతున్నారు. ఈ ఆలయంలో ప్రతి రోజూ పూజలు జరిగితే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ముస్లింలు కూడా ప్రకటించారు. మా వైపు నుంచి మాత్రం ఎలాంటి సమస్యా వుండదని హామీ ఇచ్చారు.