40 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయమే… సొంతంగా వాతావరణ కేంద్రం కూడా…

మా ఇల్లు మాత్రమే బాగుండాలని కోరుకోవడం స్వార్థం. చుట్టు పక్కన వున్నవారంతా ఆరోగ్యంగా, మంచి ఆహారం స్వీకరిస్తూ బాగుండాలని కోరుకోవడం పరమార్థం. గుళ్లపల్లి సుజాత రెండో కోవకి చెందిన వారు. చుట్టు పక్కన వారు, బంధువులు క్రిమి సంహారకాలతో కూడిన ఆహారాన్ని స్వీకరించడం, మరణించడం దగ్గరి నుండి చూశారు. దీంతో ఎలాగైనా… మంచి ఆహారం, క్రిమి సంహారకాలు లేని ఆహారాన్ని ప్రపంచానికి పంచాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయం గానీ, సేంద్రీయ వ్యవసాయం అంటే అస్సలే తెలియదు. అయినా వెనకడుగు వేయలేదు.

40 ఎకరాల పొలం కొని, గత కొన్ని సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది ఈ మహిళా రైతు. ప్రకృతి వ్యవసాయం గురించి తెలియక పోయినా… పుస్తకాలు, వీడియోలతో అవగాహన పెంచుకున్నారు. పాలేకర్ శిక్షణ ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. రాళ్లు, రప్పలు, ముళ్లతో కూడిన అస్తవ్యస్థ నేలను సరి చేసి, ఇప్పుడు పంటలు పండిస్తున్నారు. ‘‘విశ్వమాత ఫామ్స్’’ అని పేరు పెట్టి, సేంద్రీయ పంటలు పండిస్తున్నారు.

గుళ్లపల్లి సుజాత స్వస్థలం ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండల పెదారకట్ల గ్రామంలోని రాళ్లు రప్పలతో వున్న 40 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, బాగు చేసుకొని, ప్రకృతి సేద్యం చేస్తున్నారు. తన భర్త కోటేశ్వర రావు. మెకానికల్ ఇంజినీర్ చేసి రైటర్డ్ అయ్యారు. భర్త తోడ్పాటు, పుస్తకాలు చదవడం, సొంతంగా చేయాలన పట్టుదలతో చేస్తున్నారు. వాతావరణానికి అనుగుణంగా సేంద్రీయ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు.

వృత్తి, వ్యాపారాలలో స్థిరపడి, ఆదాయ వనరులకు లోటు లేని మధ్య తరగతి ప్రజలు సైతం తమవంతు బాధ్యతగా రసాయన రహిత, సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించుకోవచ్చని అవగాహన కల్పిస్తున్నారు.

సొంతంగా వ్యవసాయం చేయడానికి పైసా లేదు. అయినా సొంత ఇల్లుని అమ్మేసి, ప్రకాశం జిల్లా పెద్దారికట్ల గ్రామంలో 30 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. రాళ్లు, రప్పలతో వున్న భూమిని సాగుకు తేవడానికి ఏడాది పట్టింది. కరెంటు సౌకర్యం లేకపోవడంతో సోలార్ విద్యుత్తుతో నడిచే మోటారును ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత సుభాష్ పాలేకర్ రాసిన పుస్తకాలను చదవడం ప్రారంభించారు. ఆఇ తర్వాత చెన్నైలోని అన్నా యూనివర్శిటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ విభాగం నిర్వహించిన దేశీసీడ్స్ ఎగ్జిబిషన్ లో విత్తనాలు కొనుగోలు చేసి, 2014 లో సాగు ప్రారంభించారు.

ఆవు పేడ, మూత్రం తొలి దశలో పొదిలోని గోశల నుంచి సేకరించారు. వాటితో జీవామృతం, వివిధ ఔషద మొక్కల ఆకులు, అలములను సేకరించి, కషాయాలను స్వయంగా తయారు చేసింది. దగ్గరుండి పంటలకు వాడించారు. సోలార్ పంపుతోనే డ్రిప్ తో పంటలు పండించారు. మధ్య మధ్యలో అవగాహన కోసం పాలేకర్ పుస్తకాలనే బాగా చదివారు. దీంతో మొదట సేంద్రీయ పద్ధతిలో మొక్కజొన్న అద్భుతంగా పండింది. దీంతో ఆమెలో ఎనలేని ధైర్యం వచ్చేసింది. ఆ తర్వాత కినోవా కూడా పండించారు. అయితే.. ప్రాసెసింగ్ సదుపాయాలు లేక చెన్నై తీసుకెళ్లి ప్రాసెస్ చేయించారు. ఇప్పుడు కూరగాయలు కూడా సేంద్రీయ పద్ధతిలోనే పండించుకుంటున్నామని తెలిపారు.

మొత్తం 40 ఎకరాల్లో 20 ఎకరాల్లో మామిడి, నేరెడు, దానిమ్మ, సీతాఫలం, అరటి, జామ, బొప్పాయి, సపోట పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. మిగతా పొలంలో అపరాలు, చిరుధాన్యాలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. అయితే పంటల మార్పిడి పద్ధతిని అనుసరిస్తున్నారు. 5 ఎకరాల్లో మామిడి ప్రధాన పంటంగా 5 అంతస్తుల సేద్యం ప్రారంభించారు. అరెకరంలో పశుగ్రాసం. కేవలం పక్షుల ఆహారం కోసం పొలం చుట్టూ కొన్ని సాళ్లలో జొన్న పంట వేస్తున్నారు. ప్రతి సాయంత్రం పక్షులు జొన్న పంటలను తిని వెళ్తుంటాయి.

మరోవైపు తమ వ్యవసాయ క్షేత్రంలోనే వాతావరణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. సొంత ఖర్చుతో ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన యంత్ర పరికరాలతో దీన్ని స్థాపించారు. వర్షం గురించి, వాతావరణ పరిస్థితుల గురించి ముందస్తుగానే సమాచారం తెలుస్తుంది. వర్షం సూచనలు వుంటే పురుగుల మందు చల్లడం లేదని, నీటి తడి ఇవ్వడం లేదని, దీంతో వృథా తగ్గిపోతోందని తెలిపారు.అలాగే వాతావరణ సూచనలను బట్టే ప్రణాళికలు తయారు చేసుకుంటున్నామని అన్నారు. 5 కిలోమీటర్ల పరిధిలోని రైతులకు కూడా ఉపయోగకరంగా వుందని తెలిపారు.

తమ పొలంలోని ఉత్పత్తులన్నీ సేంద్రీయ పద్ధతే అని, సర్టిఫికేట్ కూడా పొందామని సుజాత తెలిపారు. మూడేళ్ల పాటు పరీక్షలు నిర్వహించి, నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్) సర్టిఫికేట్ తీసుకున్నామని తెలిపారు. అయితే… తొలి దశలో తమ ఉత్పత్తుల అమ్మకాలకు ఇబ్బందులు వచ్చాయన్నారు. అయితే.. వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి, ప్రయత్నాలు చేశామని, విశ్వమాత ఫామ్స్ పేరిట దేశ, విదేశాల్లో అమ్ముతున్నామని తెలిపారు. చైన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో తమ ఉత్పత్తులను కొనుగోలు చేసే వారు వున్నారని తెలిపారు.ఇక… రైతునేస్తం, ముప్పవరకు ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు అవార్డును సుజాత దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *