60 ఏళ్లు దాటిన రైతులందరికీ నెలకు 3 వేల పింఛన్… కేంద్ర ప్రభుత్వం కీలక పథకమిదీ…
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో అన్నదాతల కోసం కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఇలాంటి పథకాల్లో ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కూడా ఒకటి. ఈ పథకంలో రైతులు అందరూ చేరొచ్చు. ఇలా స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి నెలా డబ్బులు వస్తాయి. అయితే పథకంలో చేరిన వెంటనే డబ్బులు రావు. 60 ఏళ్లు వచ్చిన దగ్గరి నుంచి డబ్బులు చేతికి లభిస్తాయి. అన్నదాతలకు వృద్ధాప్యంలో ఆసరాగా, సామాజికంగా కూడా భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం 2018 లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
పథకంలో చేరిన రైతులు వయస్సును బట్టి ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి వుంటుంది. ఈ మేరకు ప్రభుత్వం తన వంతుగా బీమా కంపెనీకి డబ్బులు చెల్లిస్తుంది. 18 ఏళ్ల రైతు తన వాటాగా 55 రూపాయలు చెల్లిస్తే… కేంద్రం 55 కలిపి బీమా కంపెనీకి 110 రూపాయలు చెల్లిస్తోంది. ఏట వయస్సును బట్టి ప్రీమియం రూ.3 నుంచి రూ. 10 వరకు పెరుగుతుంది. ఇలా 40 ఏళ్ల వారికి రూ. 200 ప్రీమియం వుంటుంది. ఇలా ప్రతి నెలా లేదా మూడు నాలుగు, ఆరు మాసాలకోసారి సైతం నెలవారీ కిస్తులు చెల్లించే వెసులుబాటు కల్పించారు. అనంతం 60 ఏళ్ల పైబడిన రైతులందరికీ నెలకు 3 వేల రూపాయల పింఛను అందుతుంది. లేదా ఒకేసారి తనకు రైతులు డబ్బులు కావాలనుకుంటే రైతు కట్టిన, సర్కారు చెల్లించిన మొత్తంలో సగం ఒకేసారి అందజేస్తారు. పథకంలో చేరిన రైతు మరణిస్తే… తన భార్య కొనసాగించవచ్చు కూడా.
ఇంతకీ ఎలా నమోదు చేసుకోవాలంటే….
ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజనలో చేరడానికి రైతులు కామన్ సర్వీస్ సెంటర్ కి వెళ్లాలి. ఆధార్, ఫొటో, పట్టాదారు పాస్ బుక్, ఫోన్ నెంబర్ తదితర వివరాలతో పీఎంకేఎంవై పోర్టల్ లో నమోదు చేసుకోవాలి. సమాచారం అందిన తర్వాత నిర్వాహకులు ప్రత్యేక పింఛను ఖాతా తెరిచి కార్డును అందజేస్తారు. ఈ దరఖాస్తుకి అవసరమయ్యే డబ్బులు 30 రూపాయలు కూడా ఆన్ లైన్ సేవా కేంద్రం నిర్వాహకులకు కేంద్ర సర్కారే చెల్లిస్తుంది.
18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయసు వారందరూ అర్హులే.
పీఎం కిసాన్ డబ్బులు పడే వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, ఇంజినీర్లు, ఇతరత్రా వృత్తిపరమైన నిపుణులు అనర్హులు.
ఐటీ చెల్లించే వారు, నిర్దేశిత కన్నా ఎక్కువ రాబడి పొందుతున్నవారు అనర్హులు.