ఊరుఊరే ప్రకృతి వ్యవసాయం వైపు… మహిళా రైతులే వెన్నెముక
ఇప్పటి వ్యవసాయం అంతా క్రిమిసంహారక మందులతోనే నడుస్తోంది. దీంతో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. భూమి కూడా అంత సరిగ్గా పండటం లేదు. దీంతో కొద్ది మంది ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ప్రజల్లో కూడా ఇప్పుడిప్పుడు కాస్తంతా అవగాహన కూడా పెరుగుతోంది. అయితే.. సామూహికంగా ఈ అవగాహన ఏర్పడితే మరింత లాభాలుంటాయి. అయితే.. ఏపీలోని నరసరావు పేట ప్రజలు ఇందులో ముందంజలో వున్నారు. రసాయన వ్యవసాయంలో వున్న నష్టాన్ని గుర్తించి, వెంటనే ఊరు ఊరంతా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిపోయారు. ఓ వైపు భూసారాన్ని పెంచుతూనే… మరోవైపు అధిక దిగుబడులు కూడా ఈ ప్రకృతి వ్యవసాయంతో సాధిస్తున్నారు.
అయితే ఈ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర మహిళలదే. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా రైతులను గుర్తించారు. గ్రామాల వారీగా వారికి అవగాహన కల్పిస్తున్నారు. అతి తక్కువ ఖర్చు, అధిక దిగుబడితో ప్రకృతి వ్యవసాయం ద్వారా చేయవచ్చని వివరిస్తున్నారు. దీంతో మహిళలు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఆసక్తి కూడా చూపుతున్నారు. మొదటగా పెద్ద పెద్ద పంటలు కాకుండా తమ ఇంటికి అవసరమైన కూరగాయల ద్వారా ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెడుతున్నారు. నాలుగు సంవత్సరాలుగా కృషి చేస్తూ పోతే.. ఆ జిల్లాలో ప్రకృతి సాగు అంచనాలకు మించిందని అధికారులు ప్రకటించారు.
ఇక… జిల్లా రైతులు ఇలా మారిపోవడానికి వ్యవసాయ శాఖ కూడా పనిచేస్తోంది. రైతు భరోసా కేంద్రాలకి ఈ బాధ్యతలు అప్పగించింది. వీరు రైతులకు ప్రకృతి సాగుపై శిక్షణ కల్పిస్తున్నారు. ఈ వ్యవసాయానికి వాడే ఉత్పాదకాలు రైతులే సొంతంగా తయారు చేసుకునేలా చూస్తున్నారు. అయితే… దేశీ ఆవులు లేని రైతులవిషయంలో కూడా వ్యవసాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక్కో మండలంలో ఐదు నుంచి పది వరకు నాన్ పెస్టిసైడ్ మేనేజ్ మెంట్ దుకాణాలను కూడా ఏర్పాటు చేశారు.
మరో వైపు ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన ఉత్పత్తులను మార్క్ ఫెడ్ ద్వారా 10 నుంచి 15 శాతం అధిక మద్దతు ధర చెల్లించేలా ప్రకృతి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది. రైతులతో ముందస్తుగానే ఒప్పందాలు కూడా చేసుకుంది. దీంతో గిరాకీ కూడా వేగంగా పెరుగుతోంది. వినియోగదారులే రైతుల వద్దకు వచ్చి, అధిక ధర చెల్లించి మరీ తీసుకుంటున్నారు.