56మంది పాకిస్తానీ హిందువులకు భారత పౌరసత్వం

పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం 56మందికి భారత పౌరసత్వం ఇచ్చింది. ఆ 56మందీ పాకిస్తాన్‌ నుంచి రెండు దశాబ్దాల కంటె ముందు భారతదేశానికి శరణార్థులుగా వచ్చి గుజరాత్‌లో నివసిస్తున్న హిందువులు. డిసెంబర్ 11న అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వారికి పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసారు.

భారత పౌరులుగా అధికారిక గుర్తింపు పొందిన వారికి హోంమంత్రి శుభాకాంక్షలు చెప్పారు. ‘‘హాయిగా నవ్వండి. ఇప్పుడు మీరు ఈ గొప్ప భారతదేశపు పౌరులు’’ అంటూ వారిలో ఉద్వేగాన్ని తగ్గించారు. ఎన్నో యేళ్ళుగా పౌరసత్వ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న ఆ శరణార్థులకు ఈ చర్య ఊరట కలిగించింది.

భారత పౌరసత్వం అందుకున్న 56మంది వ్యక్తుల్లో హిషా కుమారిది ప్రత్యేకమైన పరిస్థితి. హిషా 1998లో పాకిస్తాన్‌లో పుట్టింది. హిందువులపై హింసాకాండ, ఊచకోతను తప్పించుకునేందుకు, మెరుగైన స్వతంత్రమైన భవిష్యత్తును గడిపేందుకు ఆమె కుటుంబం 2013లో భారతదేశానికి వచ్చేసింది. ఇక్కడకు వచ్చాక 9వ తరగతి నుంచీ తన చదువు మళ్ళీ మొదలుపెట్టింది. 2017లో అజ్మేర్‌లో వైద్యకళాశాలలో అడ్మిషన్ సాధించింది. ఈ మధ్యనే ఆమె తన వైద్యవిద్య పూర్తిచేసింది. వైద్యురాలిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. భారత పౌరసత్వం సాధించడం ఆమెను ఉద్వేగానికి గురిచేసింది. ‘‘నా అస్తిత్వాన్ని పునరుద్ధరించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు జీవితాంతం ఋణపడి ఉంటాను. ఇప్పుడు ఈ దేశ పౌరురాలిగా నేను ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు’’ అంటూ గర్వంగా తన భారతీయ పౌరసత్వ పట్టాను ప్రదర్శించింది.

సీఏఏ కింద భారత పౌరులుగా నమోదయ్యే ప్రక్రియను సులభతరం చేసినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. ‘‘గతంలో ఇలాంటి వ్యక్తులు ఢిల్లీ వెళ్ళి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేయవలసి ఉండేది. ఇప్పుడు ఇలాంటి అంశాలను స్థానికంగానే పరిష్కరించడాన్ని సుసాధ్యం చేసాము’’ అని చెప్పారు.

భారత్ నుంచి విడివడిన దేశాల్లో మతపరమైన హింస కారణంగా అక్కడ బతకలేని పరిస్థితుల్లో భారత్‌కు శరణార్థులుగా వస్తున్న వారికి పౌరసత్వం ఇవ్వడానికి మోదీ సర్కారు నిరంతరాయంగా పని చేస్తోంది. 2017 నుంచి మార్చి 2024 వ్యవధిలో 1167మంది పాకిస్తానీయులు భారత పౌరసత్వం స్వీకరించారు. వారికి ఈ 56మందినీ కలిపితే ఆ సంఖ్య 1222కు చేరింది. ఒక్క గుజరాత్‌లోనే గత ఆరు నెలల్లో 50మందికి పైగా పాకిస్తానీ హిందువులు భారత పౌరసత్వం స్వీకరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *