7 ‌వేల ఏళ్ల నాటి హరప్పా నాగరికత

హర్యానాలోని రాఖీగర్హిలో ఆర్కియాలజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా (ASI) కొత్తగా చేపట్టిన తవ్వకాలలో 7,000 సంవత్సరాల నాటి ప్రణాళికాబద్ధమైన హరప్పా నగరానికి చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. హరప్పా నాగరికతకు రాఖీగర్హి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. రాఖీగర్హిలో ఇప్పటివరకు జరిపిన తవ్వకాలను అధ్యయనం చేస్తే ఈ ప్రదేశం ఒకప్పుడు మెరుగైన ఇంజినీరింగ్‌తో రూపొందించిన ప్రణాళికాబద్ధమైన నగరం అని తేలిందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ తవ్వకాలలో హరప్పా సంస్కృతికి చెందిన అవశేషాలను అధికారులు అధ్యయనం చేశారు. వీధులు, పక్కా గోడలు, బహుళ అంతస్తుల గృహాలతో సహా పట్టణ ప్రణాళికకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. ఆభరణాలను తయారు చేసే సుమారు 5వేల సంవత్సరాల నాటి కర్మాగార అవశేషాలను కూడా వారు కనుగొన్నారు.

మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నగరాలను నిర్మించామని, పెద్ద నగరాలను నిర్మించ డానికి ఇప్పుడు ఉపయోగిస్తున్న సాంకేతికతలు, కాలువలు, చెత్త కోసం వీధుల్లో ఉంచిన చెత్తకుండీలు ఆ కాలంలోనే ఉపయోగించి నట్టు తెలిపే ఆనవాళ్లను తాము గుర్తించినట్టు అధికారులు మీడియా వర్గాలకు తెలిపారు.

ఈ తవ్వకాల్లో నగలతోపాటు ఇద్దరు మహిళల అస్తిపంజరాలు లభ్యమయ్యాయి. అస్తిపంజరాలతో పాటు మృతులు ఉపయోగించిన పాత్రలను కూడా పాతిపెట్టారు.

1969లో ప్రొఫెసర్‌ ‌సూరజ్‌ ‌భాన్‌ ‌జరిపిన పరిశోధనలో, రాఖీగర్హిలో వెలుగులోకి వచ్చిన పురావస్తు అవశేషాలు, స్థావరాలు హరప్పా సంస్కృతికి చెందినవని కనుగొన్నారు. ఆ తరువాత పురావస్తు శాఖ పూణే దక్కన్‌ ‌కళాశాల ద్వారా పరిశోధన నిర్వహించింది. ఈ ప్రదేశం 500 హెక్టార్లలో క్లస్టర్‌ ‌టౌన్‌షిప్‌ని కలిగి ఉన్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో బయటపడిన 11 మట్టిదిబ్బలకు RGR-1 నుంచి RGR-11 పేరిట నామకరణం చేశారు.

1997-98 నుంచి 1999-2000 వరకు పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాల్లో క్రీ.పూ 5వేల నుంచి 3వేల సంవత్సరం కాలం నాటి హరప్పా నాగరికతకు చెందిన వేర్వేరు వృత్తులకు చెందిన వివిధ దశలు వెల్లడయ్యాయి.

పురావస్తు శాఖ జాయింట్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌సంజయ్‌ ‌మంజుల్‌ ‌మీడియాతో మాట్లాడుతూ RGR-1 తవ్వకంలో 2.5 మీటర్ల వెడల్పు వీధులు, గోడలు కనుగొన్నట్టు తెలిపారు. ఇవన్నీ హరప్పా నగర ప్రణాళికబద్ధమైన ఇంజనీరింగ్‌ ‌సాంకేతితను చూపుతున్నట్టు తెలిపారు. ఇంటి సముదాయం అవశేషాలు, ఇండ్లలో హరప్పా ప్రజల జీవన విధానం, వారు ఉపయోగించిన మట్టి పొయ్యిలు కూడా బయటపడ్డట్టు వారు తెలిపారు.

RGR-1,3లో లభించిన అవశేషాలలో ఏనుగు చిత్రించబడిన చెక్కడం, హరప్పా లిపికి చెందిన రాళ్ల ముద్ర, నల్ల మట్టి ముద్ర, టెర్రకోట జంతువుల బొమ్మలు కుక్క, ఎద్దు, పెద్ద సంఖ్యలో స్టీటైట్‌ ‌పూసలు, విలువైన రాగి వస్తువులు, రాతి పూసలు ఉన్నాయని తెలిపారు.

1998-2001లో పురావస్తు శాఖ మొదటి సారి ఈ ప్రదేశంలో తవ్వకాలు జరిపింది. ఆ తర్వాత 2013 నుంచి 2016 వరకు డెక్కన్‌ ‌కాలేజీ, పుణె ఇక్కడ పరిశోధన చేసింది. RGR-1 కు నైరుతిలో ఉన్న RGR-3 తవ్వకంలో 11 మీటర్ల పొడవు, 58 సెం.మీ వెడల్పు గల ఇటుక గోడలతో కూడిన కాలువను కనుగొన్నారు. RGR-1కి ఉత్తరాన 500 మీటర్ల దూరంలో ఉన్న RGR-7లో మునుపటి తవ్వకంలో, దాదాపు 60 అస్తిపంజరాలు బయట పడ్డాయి.

రాఖీగర్హి లో బయటపడ్డ పురాతన వస్తువులను ఒక మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. దీని కోసం హర్యానా ప్రభుత్వం, పురావస్తు శాఖ మధ్య అవగాహన ఒప్పందం కూడా జరుగుతోంది.

పురావస్తు శాఖ సెప్టెంబరు 2022లో తవ్వకాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఈ మట్టి దిబ్బలను తెరుస్తుంది, తద్వారా పర్యాటకులు పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. అతి త్వరలో, రాఖీగర్హికి పర్యాటక తాకిడి పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2020-21 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం, ఫిబ్రవరి 24, 2022న తవ్వకం ప్రారంభించిన ఐదు అత్యుత్తమ ప్రదేశాలలో ఈ స్థలం ఒకటిగా అభివృద్ధి చెందుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *