డ్రోన్ల ద్వారా క్షిపణి ప్రయోగం.. DRDO పరీక్ష విజయవంతం

భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) మరో విజయాన్ని అందుకుంది. డ్రోన్ ద్వారా ప్రిసిషన్ గైడెడ్ మిసైల్‌-వీ3ని (యూఎల్‌పీజీఎమ్) విజయవంతంగా ప్రయోగించింది. కర్నూల్‌లోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్‌‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో డీఆర్‌డీఓతో పాటు రక్షణ రంగానికి చెందిన పలు సంస్థలు పాల్గొన్నాయి.పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ రక్షణ రంగ సామర్థ్యాల అభివృద్ధికి ఈ ప్రయోగం గొప్ప ప్రోత్సాహకమని వ్యాఖ్యానించారు.సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగలిగే సత్తా భారత్ కి వుందని ఈ పరీక్ష నిరూపించిందని పేర్కొన్నారు.

డ్రోన్స్‌తో పాటు ఇతర వేదికల నుంచి ప్రయోగించే విధంగా యూఎల్‌పీజీఎమ్‌ను డీఆర్‌డీఓ అభివృద్ధి చేస్తోంది. సుదూరాన ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసేలా ఈ తేలిక పాటి మిసైల్‌ను అభివృద్ధి చేస్తోంది.ఇక కర్నూల్‌లోని ప్రయోగ వేదికలో ఆయుధ పరీక్షలకు సంబంధించి అనేక ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల అక్కడ లేజర్ ఆధారిత ఆయుధాలను (డీఈడబ్ల్యూ) కూడా విజయవంతంగా పరీక్షించారు. ఫిక్స్‌డ్ వింగ్ యూఏవీలు, స్వార్మ్ డ్రోన్స్‌ను ధ్వంసం చేసేలా డీఈడబ్ల్యూలను అభివృద్ధి చేశారు.

శత్రుదేశ దాడులను తిప్పికొట్టడం, నిఘాతో పాటు ప్రతిదాడులు చేసేందుకు అవసరమైన అనేక డ్రోన్స్‌ను డీఆర్‌డీఓ అభివృద్ధి చేస్తోంది. దీర్ఘశ్రేణి లక్ష్యాలను కచ్చితత్వంతో ధ్వంసం చేసే తపస్, ఆర్చర్ డ్రోన్స్‌తో పాటు శత్రు దేశ నిఘాకు చిక్కని ఘాతక్, స్విఫ్ట్‌ డ్రోన్స్‌ను అభివృద్ధి చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *