దశాబ్దాలుగా వుండిపోయిన గాయాలు మానిపోతున్నాయి : ఎల్జీ మనోజ్ సిన్హా

పాకిస్తాన్ ప్రాయోజిత ఇస్లామిక్ ఉగ్రవాదుల మారణ హోమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ సారథ్యంలోని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అండగా నిలబడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 158 మంది కుటుంబాలకు చెందిన వారికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
దశాబ్దాలుగా వుండిపోయిన గాయాలు మానిపోతున్నాయని, న్యాయం అందుతోందని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా మనో వేదనను భరించారని, ఇప్పుడు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా అమరులందరికీ నివాళులు అర్పించారు. గత మూడు దశాబ్దాలుగా పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రజలు అనేక బాధలు పడ్డారని, అయినా… అత్యంత ధైర్య సాహసాలతో అమరుల కుటుంబాలు తమ జీవితాలను కొనసాగిస్తున్నాయని ప్రశంసించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓ రెడ్ లైన్ గీసిందని, ఉగ్రవాదులకు, వారి ప్రేరేపితులకు కూడా శిక్షపడుతుందని ప్రకటించారు. మూడు దశాబ్దాలకు పైగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్, అమాయకుల రక్తాన్ని చిందిస్తోందని మండిపడ్డారు.  అయితే ఆర్థిక పరిహారం, ఉద్యోగం అనేవి కుటుంబంలో ఏర్పడ్డ శూన్యతను పూరించలేదని, అయితే.. గౌరవంగా బతికేలా మాత్రం చేస్తుందని మనోజ్ సిన్హా అన్నారు. ఆర్టికల్ 370 రద్దు అందరికీ సమానత్వం, న్యాయం మరియు అవకాశాలను ఇచ్చే కొత్త జమ్మూ కశ్మీర్ ఆవిర్భవించిందన్నారు. గతంలో ఉగ్రవాద సానుభూతిపరులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేవని, నేడు మాత్రం అమరులైన కుటుంబాలకు వెళ్తున్నాయని మనోజ్ సిన్హా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *