గ్రామంలో మైదానం కోసం ఐదెకరాల భూమిని విరాళంగా ఇచ్చిన 95 ఏళ్ల మహిళ

క్రీడలే తమ జీవన విధానమని, తమ సర్వస్వమని ఒడిశా నువాపాడ జిల్లాలోని సింగ్జార్ గ్రామం వారు జీవిస్తుంటారు. అయితే.. మైదానం మాత్రం వీరికి లేదు. దీంతో తాము మరింత రాణించలేకపోతున్నామని చాలా మథనపడుతున్నారు. దీనికి ఓ వృద్ధ మహిళ సహాయ సహకారాలతో ఓ మైదానం వచ్చింది. ఇంత పెద్ద పెద్ద మనుషులున్నా… ప్రభుత్వాలున్నా… ఎవ్వరి వల్లా కుదరని ఓ పని ఈ వృద్ధ మహిళతో సాధ్యమైంది.

సావిత్రి మాఝి (95) అనే మహిళ… తనకు చెందిన ఐదెకరాల భూమిని ఈ స్టేడియం కోసం విరాళంగా ఇచ్చింది. దీని ద్వారా యువకులు ఆటల్లో రాణిస్తారని, గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని పేర్కొంది. అయితే… ఈ దాతృత్వం కేవలం ఆ ఊరి వారికి మాత్రమే తెలిసింది. కానీ.. ఆ జిల్లా కలెక్టర్ ఆ వృద్ధ మహిళకు కృతజ్ఞతలు తెలియజేయడానికి తన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంలో దేశం మొత్తం సావిత్రి మాఝి చేసిన ఉపకారం వెలుగులోకి వచ్చింది.

సింగ్జార్ గ్రామం గత ఐదు దశాబ్దాలుగా అనేక క్రీడలను నిర్వహిస్తోంది. అంతర్రాష్ట్ర బుధరాజ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను కూడా నిర్వహిస్తుంది. ఈ టోర్నమెంట్ లో రాయ్ పూర్, బిలాస్ పూర్, కటక్, భువనేశ్వర్ తో పాటు పొరుగున వున్న జార్ఖండ్ నుంచి కూడా జట్లు పాల్గొంటాయి. క్రికెట్ టోర్నమెంట్ తో పాటు ఫుట్ బాల్, కబడ్డీ టోర్నమెంట్లను కూడా నిర్వహిస్తుంది.

అయితే… ఈ టోర్నమెంట్లు గానీ, స్థానికులు గానీ ప్రైవేట్ స్థలాలని వినియోగిస్తున్నారు. డబ్బులు పోసి, ఈ ప్రైవేట్ స్థలాలను వినియోగిస్తున్నారు. ఇది తమకు భారంగా మారుతోందని గ్రామస్థులు వాపోయారు. కానీ… సావిత్రి మాఝి తన భూమిని విరాళంగా ఇవ్వడంతో ఇబ్బందులు తొలిగిపోయాయి.

ప్రతి టోర్నమెంట్ కి ముందు స్థానికులు తమకు శాశ్వతంగా స్థలం కేటాయించాలని జిల్లా యంత్రాంగాన్ని సంప్రదిస్తూ వుంటారు. అయినా ఫలితం లేకపోయేదని స్థానికులు పేర్కొన్నారు. చివరికి తాము సావిత్రి మాఝిని కలిశామని, పరిస్థితి వివరించామన్నారు. అయితే ఊరి వాళ్లు సావిత్రిని కలిసి, పరిస్థితి వివరించారు. దీంతో సావిత్రి మాఝి తన ఐదెకరాల భూమిని విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు. గిఫ్ట్ డీడీ కింద రాసిచ్చేశారు.

మరోవైపు సావిత్రి మాఝి భర్త నీలాంబర్ మాఝీ యేడాది క్రితమే మరణించారు. తాను జీవించిన సమయంలో పాఠశాల, ఆలయ నిర్మాణం కోసం కొంత భూమిని విరాళంగా ఇచ్చారు. అలాగే కొంత మంది నిరుపేద పిల్లలకు కూడా అడపాదడపా సాయం చేసేవారు. ఇప్పుడు సావిత్రి మాఝి కూడా మైదానం కోసం భూమిని విరాళంగా ఇచ్చి.. ఆదర్శంగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *