పుస్తకమే ధ్యాస, గ్రంథాలయమే ఇల్లు
కూరెళ్ల విఠలాచార్య.. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రశంసలందుకున్న అక్షర పిపాసి. జీవితమంతా ‘‘పుస్తకం’’ మీద ధ్యాసే. ‘‘కలలను నిజం చేసుకోవడానికి వయస్సు అడ్డుకాదు, ఈ విషయలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 84 సంవత్సరాల డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య మనందరికీ ఆదర్శం, ఆయన స్వస్థలం యదాద్రి భువనగిరి జిల్లా ఎల్లంకి. ఆయనకు చిన్నతనం నుంచి ఒక పెద్ద గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే కోరిక వుండేది. చదువుకొని లెక్చరర్‌గా ఉద్యోగం చేశారు. పుస్తకాలను సేకరిస్తూ వచ్చారు. పదవీ విరమణ పొందిన తర్వాత పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పట్టుదల వుంటే ఏదైనా సాధించవచ్చని, వయస్సుతో సంబంధం లేదని ఆయన నిరూపిం చారు’’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌లో ప్రశంసలు కురిపించారు. దీంతో దేశ మంతటికి కూరెళ్ల విఠలాచార్య చేసిన సేవ పరిచయ మైంది. ఆయన ఊపిరే పుస్తకం. ఆయన ధ్యాసే గ్రంథాలయం. పుస్తకమే అందరికీ ప్రపంచం కావా లన్నది ఆయన ఆకాంక్ష.
ఆయన చదువుకునే రోజుల్లోనే సెలవులకో, పండగలకో తన స్వగ్రామమైన ఎల్లంకికి వెళ్లేవారు. అప్పుడే ఆయనకు గ్రంథాలయం స్థాపించాలన్న కోరిక బలంగా వుండేది. ఈ బలమైన కాంక్ష తన సొంతూరికి వచ్చినప్పుడు కొద్దిగా తీరింది. 1955 సంవత్సరంలో తిమ్మాపురం వీరారెడ్డి, కణతార నరసింహారెడ్డి, పోలు నరసింహారెడ్డి, రావీటి విఠ లేశ్వరం లాంటి మిత్రులతో కలిసి ‘‘శ్రీ శంభు లింగేశ్వర స్వామి గ్రంథాలయం’’ అన్న పేరుతో అప్పుడే ఓ గ్రంథాలయాన్ని స్థాపించారు. దీనిని ఆ ఊరి దేశ్‌ముఖ్
అనుముల లక్ష్మీనరసింహారావు ప్రారంభించారు. తన మిత్రులతో కలిసి ఇల్లిల్లూ తిరిగేవారు. జాతీయ ఉద్యమానికి సంబంధించిన పుస్తకాలు, దేశభక్తుల పుస్తకాలు, తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు సేకరించేవారు. అలా సేకరించిన పుస్తకా లతో గ్రంథాలయం పరిపూర్ణమైంది. ఈ గ్రంథాల యంలో యువత బాగా చదువుకుంటూ స్ఫూర్తి పొందారు. ఈ పుస్తకాల సేకరణ, గ్రంథాలయ స్థాపన మిగతా యువకులకు కూడా స్ఫూర్తినిచ్చింది. అయితే ఈ గ్రంథాలయం ఎక్కువ కాలం నిలువనే లేదు. దీంతో విఠలాచార్య క్రుంగిపోకుండా ప్రయ త్నాలు మాత్రం చేస్తూనే వున్నారు.
అటు పుస్తక ఉద్యమంతో పాటు అక్షరాస్యతా ఉద్యమాన్ని కూడా ఆయన నడిపారు. అందరూ చదువుకోవాలన్న తపన ఆయనకు బాగా వుండేది. అటు పుస్తకాల కోసం, ఇటు అక్షరాస్యత కోసం పల్లెల్లో బాగా పనిచేసేవారు. బాగా ప్రేరణను కూడా కలిపించేవారు. ఎవరికి ఏ పుస్తకం కావాలన్నా వెతికి మరీ ఇచ్చేవారు. దాంతో ఆ విద్యార్థులు పుస్తకం చదివి, బాగా లాభపడేవారు. తన చిన్నతనంలో చదువుకోవడానికి పుస్తకాలు దొరకలేదని, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, ఇప్పటి తరానికి ఆ ఇబ్బంది వుండొద్దన్న ఉద్దేశ్యంతో తాను ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని భుజానికెత్తు కున్నానని ఆయన చాలాసార్లు చెప్పారు.
దేశభక్తి పెంపొందించడానికి, సాహిత్య పరిమళాలను విస్తరింపజేయడానికి, దైవభక్తిని ప్రేరేపించడానికి కూరెళ్ల కొన్ని సంస్థలను కూడా స్థాపించారు. అక్షర కళాభారతి, భువన భారతి, మిత్ర భారతి, ప్రజా భారతి, ఆత్మీయ భారతి, బాల భారతి, మహిళా భారతి లాంటి సంస్థలను నెలకొల్పారు. వీటి ద్వారా పుస్తకాల పంపిణీ, సాహిత్య సేవ చేసేవారు. అలాగే ఎవ్వరు పుస్తకాలు అడిగినా ఇచ్చేవారు. లేని పక్షంలో సేకరించి అయినా ఇచ్చేవారు. సంస్థలతో పాటు ఆయన కొన్ని విద్యా కేంద్రాల్లో పత్రికలను కూడా స్థాపించి, చైతన్య స్థాయిని పెంచడానికి ప్రయత్నాలు చేశారు. 1. గోకారం ప్రాథమిక పాఠశాలలో ‘‘బాపు భారతి’’ అనే పత్రిక, ఎల్లంకి ఉన్నత పాఠశాలలో ‘‘మా తెలుగు తల్లి’’ అనే పత్రిక, వలిగొండ ఉన్నత పాఠశాలలో ‘‘వలి వెలుగు’’ అనే పత్రిక, రామన్న పేటలో ‘‘మన పురోగమనం’’ అన్న పత్రిక, ససరిపురం ఉన్నత పాఠశాలలో ‘‘చిరంజీవి’’ అనే పత్రిక, నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘‘ప్రియంవద’’ అనే పత్రిక, రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘‘ముచికుంద’’ అనే పత్రిక, చౌటుప్పల్ గ్రంథాలయంలో ‘‘లేఖిని’’ అన్న పత్రిక ప్రారంభించి అక్షరాస్యతకు, సాహిత్య వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు.
ఈయన ఉద్యమమే మాజీ సిఎం చంద్రబాబుకి స్ఫూర్తి
కూరెళ్ల విఠలాచార్య అక్షరాస్యత ఉద్యమాన్ని ఊరారా వ్యాప్తి చేసేందుకు చాలా కష్టపడ్డారు. దీనిని ఓ ఉద్యమం లాగానే నడిపించారు. కలిసొచ్చె ప్రతి పుస్తకాన్నీ, ప్రతి వ్యక్తినీ తన వెంట తీసుకెళ్లారు. ప్రధానోపాధ్యాయునిగా కొనసాగుతూ నల్లగొండ జిల్లా రామన్న పేట పరిసర ప్రాంతాల్లో సాహితీ సంస్థలను స్థాపించి, యువ కవులను, రచయితలను బాగా ప్రోత్సహించారు. తాను ప్రధానోపాధ్యా యునిగా వున్న సమయంలో భువనగిరి మండలం వడాయిగూడెంలో రాత్రి వేళల్లో పేద వారికి చదువు చెప్పుతూ అక్షరాస్యతా ఉద్యమాన్ని కూడా నడిపిం చారు. ఈ ఉద్యమమే అప్పటి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడికి ప్రేరణగా ఉపయోగపడింది. ఈ ఉద్యమం ప్రేరణతోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ‘‘చదువు`వెలుగు’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మొదట 5 వేల పుస్తకాలతో ఇంట్లోనే గ్రంథాలయం ప్రారంభం
ఓ వైపు ఊరూరా గ్రంథాలయాల స్థాపన, పుస్తకాల పంపిణీ చేస్తూనే కూరెళ్ల తన ఇంట్లోనే 5 వేల పుస్తకాలతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. తనకొచ్చే పింఛన్ డబ్బులు కూడా గ్రంథాలయ స్థాపనకు, పుస్తకాల కోసమే వెచ్చించారు. ఆయన ఇచ్చిన పుస్తకాలతో ఎంతోమంది విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తయారయ్యారు. తాజాగా ఆయన వుండే ఇంటిని కూల్చి, దాతల సహకారంతో, తన డబ్బుతో తన ఇంట్లోనే 50 లక్షల రూపాయలతో ఓ అద్భుతమైన గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన స్ఫూర్తితోనే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు 15 గ్రంథాల యాలు ప్రారంభమయ్యాయి. ఈ గ్రంథాలయం, ఆయన పంచిన పుస్తకాల సహాయంతో పరిశోధ నలు చేసి ఇప్పటివరకు 17 మంది డాక్టరేట్లు పొందారు. ఇంతలా గ్రంథాలయ ఉద్యమాన్ని, అక్షరాస్యతా ఉద్యమాన్ని, పుస్తక ప్రచారాన్ని చేసినందుకు భారత ప్రభుత్వం ఆయనను ‘‘పద్మశ్రీ’’ అవార్డుతో సత్కరించింది. ‘‘అన్నదానం పరం దానం విద్యాదానమతః పరం । అన్నేనక్షణికా తృప్తిర్యావజ్జీవం చ విద్యయా’’ అన్నట్లు గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన అక్షర చైతన్య మూర్తి.