కుటుంబం సేవకు ప్రతిబింబం

ఒకరు అనేకులు కావడమే సృష్టి రహస్యం అని పెద్దలు చెబుతారు. ఒకరు ఇద్దరై ఇద్దరు నలుగురు, పదమంది కావడమే కుటుంబం. అయితే ఒక అయస్కాంతంలో అణువులన్నీ ఒక పద్ధతిగా అమరి ఉండడంవల్లనే అయస్కాంత తత్వం వచ్చినట్లుగా అన్నిటినీ ఆకర్షించే గుణమున్నట్లుగా కుటుంబం కూడా ఒక ఆకర్షణ కేంద్రం. అందరూ కలిసి మెలిసి  పరస్పరం ఒకరికొరు సేవించుకునే సేవానిలయం. ఇల్లాలు ఇంట్లో బహుముఖ పాత్ర పోషిస్తుంది. పిల్లలను కనడం, పెంచడం, సంస్కారాలు నేర్పడం వంటి శిక్షణతో పాటు భర్తకు అన్నీ సమయాని అందించడం చేస్తుంటుంది. భర్త లేదా ఇంటి పెద్ద పిల్లలకు విద్యా బుద్ధులను నేర్పడంతో బాటు వారికి రక్షణగా ఉంటాడు. భార్యను భరిస్తాడు. సహిస్తాడు. సమాజంలో స్త్రీకి రక్షణగా, అండగా ఉండే బాధ్యత తీసుకుంటాడు. ఆడపిల్ల అయితే పెళ్ళి చేసి మరో ఇంటిని తీర్చిదిద్దేలా మెట్టింటికి పంపుతాడు. మగ పిల్లాడు అయితే తన ఇంటికి లక్ష్మీ దేవిలా వచ్చే కోడలిని చూసి మురిసిపోతాడు. ఆ కోడలు యోగ క్షేమాలకే ప్రాధాన్యత నిస్తాడు. రామాయణంలో హనుమ సీతను చూసినపుడు ‘అమ్మ నీవెవరు అంటే’ ‘దశరథుడి కోడలిని’ అని చెప్పింది. రాముడి భార్యనని చెప్పలేదు. దశరథుడు పోయిన వార్త తెలిసిన రాముడు సీతతో ‘మీ మామగారు పోయారని చెప్పాడు’ ‘మా నాన్న గతించార’ని చెప్పలేదు. శ్రావణ మాసంలో లక్ష్మీ దేవి, వరలక్ష్మి వ్రతంలో చారుమతికి దర్శనమిచ్చి అనుగ్రహించింది, కారణం ఆమె అత్త మామలను సేవించింది.

ఇంట్లో భార్యభర్తలు, వారి పిల్లలు పెళ్లయిన తరువాత కూడా ఈ బాంధవ్యాల బలంతో జీవనం సాగించాలని రామాయణం మనకు చెబుతున్నది.  తల్లిదండ్రులు పిల్లలకు సేవలు చేసి పెద్ద చేసినట్లే, పెద్దయిన తరువాత పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల సేవాభావంతో జీవించాలని అనేక మంది మహాపురుషుల జీవితాలు మనకు తెలియజేస్తు న్నాయి. శ్రవణ కుమారుడు, పుండరీకుడు తల్లి దండ్రులను సేవించిన విధానము మనకు తెలుసు. ప్రకృతిలో ప్రతి జంతువు బిడ్డల కోసం పరితపిస్తే  ఆవుదూడ తల్లికోసం పరితపిస్తుంది. కౌశికుడు అనే ముని చెట్టుకింద తపస్సు చేసుకుంటుండగా ఒక కొంగ రెట్ట వేసింది. కౌశికుడు రౌద్రంగా కొంగ వైపు చూశాడు, కొంగ నేల మీదపడి గిలగిల కొట్టుకుని ప్రాణం విడిచింది. మధ్యాహ్నం భిక్షాటన కోసం ఒక ఇంటి ముందు నిలిచి ‘భవతి భిక్షందేహి’ అని కేకవేశాడు. ఆ ఇల్లాలు ఎంతకీ బయటికి రాలేదు. ఇల్లాలు అప్పుడే ఇంటికి వచ్చిన భర్తకు సపర్యలు చేస్తున్నది. భిక్ష తేవడంలో ఆలస్యమయింది. కౌశికుడు ఆమె వంక కోపంగా చూశాడు. ‘నేల మీద పడి చచ్చిపోవడానికి నేనా కొంగను కాదు సుమా!’ అని ఆ ఇల్లాలు వినయంగా అన్నది. కౌశికుడికి జ్ఞానభిక్ష పెట్టినట్లయింది. జ్ఞానం కోసం ఊరివెలుపల కసాయి వృత్తి చేసుకునే ధర్మవ్యాధుడ్ని కలవమని చెప్పింది. జంతు మాంసం అమ్మే ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్లాడు కౌశికుడు. తనకు జ్ఞానబోధ చేయమన్నాడు. కౌశికుడ్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు ధర్మవ్యాధుడు. ‘అక్కడ ముదుసలలు, రోగులైన  తల్లి దండ్రులను సేవించు కుంటున్నాను. ఇంతకంటే నాకు విషయాలు తెలియవు’ అన్నాడు ధర్మవ్యాధుడు. ఇదే మన భారతం.

మన కుటుంబంలో గురువులను సేవించే సంస్కారం ఉంది. గురువును శిష్యులు సేవించడం కాదు. శిష్యుల కోసం తపించే గురువులున్న దేశం మనది. కృష్ణ, కుచేలురు మిత్రులు సహపాఠాలు అయిన సాందీపని ఆశ్రమంలో ఓ రోజు గురుపత్ని వారిద్దరినీ పిలిచి యాగం కోసం కావాల్సినవన్నీ తెమ్మని అడవికి పంపింది. సాయంత్రం వేళ ఇద్దరూ బయలు దేరారు. అడవిలో పని చేస్తున్నారు. ఇంతలో కారుమబ్బులు కమ్మి పెద్ద వానలో ప్రళయమే వచ్చినట్లయింది. ఇంటికి చేరుకున్న సాంధీపని శిష్యులు అడవికి వెళ్లారని తెలిసి భార్యను కోపగించాడు. శిష్యులను వెతుకుంటూ బయలు దేరి రాత్రంతా అడవిలో ఆ ప్రళయంలో కృష్ణా! కుచేలా! అంటూ ఆక్రోశించాడు. ఇలా ఒకరికొకరు తోడు నిలిచి అభిమానించుకుని సేవించుకునే ఐక్యతారాగమే కుటుంబాల కదంబ గీతం.

– హనుమత్‌ ‌ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *