తల్లిగర్భంలోని శిశువుకు గర్భసంస్కారం
– లతాకమలం
ప్రతి తల్లిదండ్రులూ తమ బిడ్డ సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉండాలనీ, పుట్టే బిడ్డ శారీరకం గానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం గర్భిణి శారీరకంగా, మానసికంగా సిద్ధపడుతుంది. బిడ్డ పుట్టక ముందు నుంచే వారిని సంస్కారవంతులుగా ఎలా తీర్చి దిద్దాలో ఆలోచిస్తుంటుంది. అయితే గర్భసంస్కార్‌తో ఇది సాధ్యం. అసలేంటీ గర్భసంస్కార్ అంటే…
ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అయిన సంవర్ధినీ న్యాస్ గర్భసంస్కార్ పేరుతో ప్రచారాన్ని ప్రారంభిం చింది. అంటే బిడ్డ పుట్టక ముందే వారికి మంచి సంస్కృతి, విలువలను నేర్పడం అన్నమాట. అదే విషయాన్ని ఆ సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధురీ మరాఠీ ఇటీవల చెప్పారు.
గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు, యోగా శిక్షకులతో పాటు గర్భధారణ సమయంలో గీతా పఠనం, రామాయణం, యోగాభ్యాసంతో కూడిన కార్యక్రమాలను ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. వారు ఈ కార్యక్రమాలను మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్లలోపు శిశువుల వరకు అందించ నున్నారు. అయితే ఈ విషయంపై చాలామంది రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. గర్భస్థ శిశువుకు నేర్పించడం ఏమిటి అంటూ ఎద్దేవా చేస్తున్నారు కూడా. పిల్లలకు ఏ వయసులో ఏం నేర్పితే వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దగలం అని తల్లి దండ్రులమదిలో నిరంతరం మెదిలే ప్రశ్న. శిశువుకు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వారికి సంస్కారం నేర్పించగలం. ఈ విషయంపై మన పూర్వీకులు పరిశీలించిన విధానాన్ని మనం మహాభారత కాలం నుంచీ చూడగలం.
మహాభారతంలోని అభిమన్యుడి కథ మనంద రికీ తెలిసిందే… తల్లి సుభద్ర గర్భంలో ఉండగానే తండ్రి అర్జునుడి ద్వారా పద్మవ్యూహ ఛేదనవిద్యను గురించి నేర్చుకున్నాడు..
మనందరికీ తెలిసిన మరో పురాణ గాథ ప్రహ్లాదుడిది. ప్రహ్లాదుడి తండ్రి హిర్యణకశిపుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే విష్ణుభక్తిని గురించి గాథలు విన్న అతను పుట్టాక గొప్ప విష్ణుభక్తుడయ్యాడని భాగవతంలో వివరించి ఉంది. ఇలాగే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లలు ఏ విధంగా తయారు కావాలని తల్లిదండ్రులు తీవ్రమైన విశ్వాసంతో కోరుకుంటే వారు అలాగే అవుతారని చెప్పడానికి మరొక తార్కాణం మార్కండేయ పురాణంలో మదాలసదేవి కథ (అధ్యాయం 21, 22)లలో ఉంది.
భాగవతంలో కపిలుడు తన తల్లికి వేదాంత బోధ చేసే సందర్భంలో జీవుడు గర్భంలో పడిన సమయం నుంచి క్రమక్రమంగా ఎలా పెరుగుతుంది అన్న విషయాన్ని వర్ణించాడు. ఈ విషయాలే మళ్లీ గర్భోపనిషత్తు అనే ఉపషత్తులో రాసి ఉన్నాయి. అంతేకాక మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ఆయుర్వేద గ్రంథాల్లోని గర్భసంస్కారం, గర్భిణీ వ్యాకరణం మొదలైన అధ్యాయాల్లో గర్భధారణ సమయంలో తల్లి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలా ఉండాలో వివరంగా విశ్లేషించారు. లలితా సహస్రనామాల్లో కూడా ఈవిషయంపై వివరణ ఉంది. దీన్నే ఇప్పుడు ప్రినేటల్ లర్నింగ్ అంటున్నారు. తాజా పరిశోధనలు కూడా ఈ విషయం నిజమని రుజువు చేస్తున్నాయి. దీన్ని నేర్పించడానికి అనేక సంస్థలు కూడా ఇప్పుడు విదేశాల్లో ఉన్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నివేదిక ప్రకారం శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి మాట్లాడే భాషను గ్రహించగలరని వారి అధ్యయనంలో పేర్కొన్నారు. గర్భధారణ వయసు 30 వారాలు వచ్చిప్పుడు శిశువు వినే విధంగా ఇంద్రియాలు, మెదడులోని నాడీకణాలు అభివఆద్ధి చెందుతాయని వారి పరిశోధనల్లో తేలింది. దీంతో గర్భంలోని శిశువుకు తల్లి ఏది చెబితే బయటక వచ్చాక కూడా అలాగే ప్రవర్తిస్తారని తేలింది. అంతేకాకుండా బిగ్గరగా వచ్చే శబ్దాలను తల్లిగర్భంలోని శిశువు ఆసక్తిగా వింటుందనీ, పిల్లల తీరును ప్రభావితం చేయడంలో తల్లిదే మొదటి ప్రాధాన్యత అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఇన్సిట్యూట్ ఫర్ లెర్నింగ్ అండ్ బ్రెయిన్ సైన్సస్ రచయిత, కో డైరక్టర్ ప్రాట్రిసియా కుప్ల్‌ా పేర్కొంది. ఈ విషయాన్ని వారి వెబ్ సైట్ లో ప్రచురించారు కూడా.