హింసకు పాల్పడే హక్కు రాజ్యాంగం నక్సల్స్‌కి కూడా ఇవ్వలేదు…
హైదరాబాద్ (ఉస్మానియా విశ్వవిద్యాలయం): దేశంలో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ పెను విధ్వంసానికి కారకులుగా నిలిచిన మావోయిస్టుల తీరును “మానవత్వమా? – మావోయిస్టుల మారణకాండా?” అని ప్రశ్నిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం నుంచి జీతాలు, సౌకర్యాలు అందుకుంటున్న విశ్వవిద్యాలయాల్లోని పలువురు ప్రొఫెసర్లు తమ విద్యార్థుల్ని మాత్రం సమాజ వ్యతిరేక శక్తులుగా మార్చేందుకు అడవుల్లోకి పంపడాన్ని నిలదీసింది. అడవుల్లో సమాంతర ప్రభుత్వాలను నడుపుతూ ఆదివాసీల జీవితాలను బలిగొంటున్న నక్సల్ హింసాకాండను ఏబీవీపీ ఆధ్వర్యాన సోమవారం జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు ఎండగట్టారు.
ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ ప్రముఖ్ టి.రామకృష్ణ సమావేశాన్ని ప్రారంభిస్తూ ఒకనాడు నక్సల్ ఉద్యమానికి అడ్డాగా నిలిచిన ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లోను, మాసాబ్ టాంక్ పాలిటెక్నిక్ కాలేజీలోను విద్యార్థులను విధ్వంసం దిశగా అడవుల్లో ఉద్యమంలోకి పంపుతున్న సమయంలో ఈ చర్యలకు అడ్డుకట్ట వేసేలా విద్యార్థి పరిషత్ నిర్మాణాత్మక పాత్ర పోషించిందన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నడిబొడ్డున జాతీయ పతాకానికి జరిగిన అవమానాన్ని ఎదిరించి బలిదానమైన సామ జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేస్తూ మావోయిస్టుల సమస్య ఎంత తీవ్రమైనదో సమాజానికి తెలిపింది విద్యార్థి పరిషత్ అన్నారు. ఆదివాసీలను, అణగారిన వర్గాలను బలిగొంటున్న మావోయిస్టుల అరాచకాలకు సుక్మా, గడ్చిరోలి తదితర ప్రాంతాలు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. మారణకాండను సృష్టిస్తున్న మావోయిస్టులపై కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌ను ఆపాలని శాంతి చర్చలను తెరపైకి తెచ్చిన వ్యక్తులు ఒకవైపు డిమాండ్ చేస్తూనే “చంపే హక్కు ప్రభుత్వానికి రాజ్యాంగం ఇవ్వలేదు” అని అంటున్నారని… అదే సమయంలో అనేక ప్రాణాలు తీసి, విధ్వంసం సృష్టించిన నక్సల్స్‌కి కూడా ఈ హక్కును రాజ్యాంగం ఇవ్వలేదని స్పష్టం చేశారు. 2004లో నాటి ప్రభుత్వంతో శాంతి చర్చల నేపథ్యంలో రిక్రూట్‌మెంట్ పెంచుకున్న నక్సలైట్లు ఎందరినో చంపారని, నాడు వీరిని అభివృద్ధి నిరోధకులుగా పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శాంతి చర్చల పేరెత్తడమేంటని రామకృష్ణ నిలదీశారు. మావోయిస్టులు హింస వదిలి సమాజంలోకి రావాలన్నారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏబీవీపీ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ డాక్టర్ మాసాడి బాబురావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో హింసకు తావుండరాదనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నిర్వహిస్తున్న “ఆపరేషన్ కగార్”ను ఆపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు – మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరడం శోచనీయమన్నారు. అభివృద్ధికి ఆటంకంగా మారిన మావోయిస్టులపై ఎందుకు ఉక్కు పిలికిలి బిగించరాదో చెప్పాలని ప్రశ్నించారు. నక్సలైట్ల చరిత్రను తెలియజేస్తూ వారి రక్త దాహాన్ని తీర్చుకోవడం కోసం సామాన్య ప్రజలను వర్గ శత్రువులుగా భావిస్తారని, వర్గ శత్రువు రక్తాన్ని కళ్ళ చూడని వాడు నక్సలైటే కాదనే నమ్మకం వారిదని ఎండగట్టారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు పెట్టుబడిదారులకు వ్యతిరేకమంటూనే సామాన్య కూలీలు ప్రయాణించే కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలులోని రెండు బోగీలను తగలబెట్టిన ఘటనను గుర్తు చేస్తూ, నక్సలైట్ల సిద్ధాంతం నచ్చక వారితో దూరంగా ఉన్నవారిని ఇన్ఫార్మర్ల నెపంతోను, అలాగే ఎంతోమంది పోలీసు అధికారులను పొట్టన పెట్టుకోవడం, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకులను హత్యా చేయడం మావోయిస్టు, నక్సల్స్ మరణకాండకు ప్రతిరూపమని అన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ నోరు మెదపని కొందరు కుహనా మేధావులు సెల్ఫ్ మేడ్ ఇంటలెక్చువల్స్‌గా చలామణి అవుతున్న అర్బన్ నక్సలైట్లు, పౌర సంఘాలు, ప్రజా సంఘాల నాయకులమని చెప్పుకుంటున్నవారు నేడు “ఆపరేషన్ కగార్”ను ఆపాలని, శాంతి చర్చలు జరపాలంటూ బహిరంగ సమావేశాల్లో మాట్లాడడం అంటే రాజ్యంగాన్ని కించపరచడమేనని ఆరోపించారు. నక్సల్స్‌గా పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసి నేడు ప్రజాసేవకులుగా ఎందరో ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లుగా పని చేస్తున్నారని అన్నారు. ఇంటలెక్టువల్స్ ముసుగులో ప్రభుత్వ జీతాలు, పెన్షన్లు తీసుకుంటూనే ప్రభుత్వంపైన తిరుగుబాటు చేసి నక్సలైట్లకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాకమిషన్‌లోని ఉన్నతాధికారులు కూడా నక్సలైట్ల మద్దతుగా మాట్లాడం సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం శోచనీయమన్నారు. నరహంతక నక్సలైట్లను ఏరి పారెయ్యడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాగతిస్తుందని, “ఆపరేషన్ కగార్”ను కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మాట్లాడుతూ… రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజా ప్రభుత్వాలను సవాల్ చేసి సమాంతర ప్రభుత్వాలను నడుపుతూ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అంటూ ప్రజల హక్కులను కాలరాసే మావోయిస్టులతో శాంతి చర్చలేమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బస్తర్‌లో ఒకనాడు 20 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన మహేంద్ర కర్మ అమాయక గిరిజనులను కాపాడేందుకు నక్సలైట్లకు వ్యతిరేకంగా చేపట్టిన సల్వాజుడుం గురించి తెలియజేస్తూ దీనిపై అధ్యయనం చెయ్యాలని సూచించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి లేకుండా, పథకాలు అమలు కాని పరిస్థితి కనిపిస్తుండగా ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు రేవంత్ సర్కారు ఎందుకు మద్దతు ఇస్తోందని రాంబాబు నిలదీశారు. నక్సల్ బాధిత కుటుంబాలతో మాట్లాడాలంటూ రేవంత్‌తో పాటు ఆపరేషన్ కగార్‌ని వ్యతిరేకించిన మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అడవుల్లో గన్‌తో నక్సలైట్లు, చేతిలో పెన్‌తో అర్బన్ నక్సలైట్లు విధ్వంసం సృష్టిస్తున్నారని, ప్రజాప్రతినిధులను, పోలీసులను సైతం చంపుతున్నారని మావోయిస్టు ఉద్యమం తీరును విద్యార్థి పరిషత్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జీవన్ తప్పుబట్టారు. విద్యార్థులు అడవి బాటపట్టేలా ప్రేరేపిస్తూ ప్రొఫెసర్లు సైతం చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. మావోయిజంకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల విద్యార్థుల నుంచే మార్పు సాధ్యమన్నారు.

ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్ స్పందిస్తూ హింసాత్మక మావోయిస్టు ఉద్యమ వ్యవస్థ 3 రకాలుగా పనిచేస్తోందన్నారు. అడవుల నుంచి ఒకవైపు, వీరికి మద్దతుగా మైదాన ప్రాంతాల్లో మానవహక్కుల సంఘాలు, కళా సంఘాల రూపంలోను, ఆట – పాట – మాటలను అందించేలా విశ్వవిద్యాలయ కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటికి మూతపడేలా చేయడం ద్వారా ఈ భావజాలాన్ని అంతమొందించవచ్చని తెలిపారు. మావోయిస్టులకు అండగా నిలిచిన వామపక్ష భావజాల వ్యాప్తి కోసం తెలంగాణలో 30కి పైగా సంస్థలు నడుస్తున్నాయని, ఒకొక్క సంస్థ వందమందికి పైగా కార్యకర్తలతో తమ కార్యకలాపాలను చేపడుతున్నాయని చెప్పారు. ఈ సంస్థలకు పైన కనిపించే బోర్డులు వేరు… లోపల జరిగేది వేరంటూ… సమాజ వ్యతిరేకులైన మావోయిస్టులను ఆపరేషన్ కగార్‌తో అణచివేయాలని స్పష్టం చేశారు.