బెంగళూరు వేదికగా ‘‘ఆచార్య సభ’’.. హాజరైన 81 మంది సాధువులు
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు ‘‘ఆచార్య సభ’’ జరిగింది. దీనికి 36 హిందూ సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 81 మంది స్వామీజీలు, సాధు సంతులు హాజరయ్యారు. ఈ ఆచార్య సభకి ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి జునపీఠాధీశ్వర్ ఆచార్య మహామండలేశ్వర పూజ్యపాద శ్రీ స్వామి అవధేశానంద గిరిజీ మహారాజ్ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాల విముక్తి, ఘర్ వాపసీ, లవ్ జిహాద్, సామాజిక సమరసత వంటి అంశాలను ధర్మాచార్యులు కూలంకషంగా చర్చించారు. అలాగే జాతీయ భద్రత, సాంస్కృతిక గుర్తింపు మరియు ప్రపంచ పరిణామాల నేపథ్యంలో తలెత్తే సవాళ్లను కూడా చర్చించారు. ఇక ఇప్పటికి మూడు రాష్ట్రాలలో ఇప్పటికే యూసీసీ అమలులో వుందని, ఈ సంవత్సరం లోపే బీజేపీ పాలిత ప్రాంతాలన్నింటిలోనూ దీనిని అమలు చేసేలా చూడాలని నిర్ణయించారు.

ఇక.. ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ సామాజిక సమరసత, సాంస్కృతిక జాగృతి, ప్రస్తుత సవాళ్లను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. దీనికి సమాజంలోని అన్ని వర్గాల సహకారాలు, చైతన్యం అవసరమని, వీటి ద్వారానే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు.
ఇక.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆచార్య సభపై సంతోషం వ్యక్తం చేశారు. ఆచార్య సభలో జరిగిన చర్చలు ఎంతో సముచితమైనవని, సభ తీర్మానాలు, ప్రజా సంక్షేమం కోసం చర్చించిన విషయాలు బాగున్నాయన్నారు. ఈ ఆచార్య సభకు అండగా నిలుస్తామని ప్రకటించారు.