మొట్టమొదటి సారిగా తెలంగాణాలో మాత అహల్యాబాయి హోల్కర్ విగ్రహావిష్కరణ
హిందూ ధర్మ పరిరక్షణ, మహిళా సాధికారతలో లోకమాత రాణి అహిల్యాబాయ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని బర్దీపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి చెందిన మహామండలేశ్వరులు సిద్దేశ్వరానందగిరి స్వామి అన్నారు. తెలంగాణలోనే మొట్టమొదటిదిగా గజ్వేల్ పట్టణంలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లోకమాత రాణి అహిల్యాబాయి హోల్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా స్వామీ సిద్దేశ్వరానందగిరి మాట్లాడుతూ చిన్నారులకు యువతకు విద్యతోపాటు సంస్కారాన్ని నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. సంస్కారం అలవాడిన వారే భవిష్యత్తులో అభివృద్ధి చెందడంతో పాటు దేశాన్ని బాగుపరుస్తారన్నారు.
సామాజిక సమరసతావేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు టీవీ సీరియల్స్ ని చూడడం మాని పిల్లలకు సంస్కారాన్ని నేర్పించాలని చెప్పారు. దేవుళ్లకు సేవలు అందించడానికి కులచారాలు ఏర్పడ్డాయి కానీ కుల వివక్ష భావనతో ప్రజలు దూరంగా మసలడానికి కాదన్నారు. అన్ని కులాల ప్రజలు సమానమే అన్న భావన అందరిలో ఉండాలని అప్పుడే దేశం బాగుపడుతుందన్నారు. మహిళలకు సమాజాన్ని దేశాన్ని మార్చే శక్తి ఉందని, ఈ విషయాన్ని గుర్తించి ఆ దారిలో ముందుకు సాగాలని మహిళలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోనే తెలంగాణలో మొట్టమొదటి అహిల్యాబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, మాత అహిల్యాబాయిని పూజించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలోని ప్రధాన ఆలయాలైన కాశి విశ్వనాథుడు సోమనాథ్ మందిరం తదితర వందకు పైగా దేవాలయాలను పునర్నించడంతోపాటు ధర్మశాల ను స్నాన ఘట్టాలను నిర్మించారన్నారు. రైతుల కార్మికుల ఆదాయాన్ని పెంచే సంస్కరణలు చేయడంతో పాటు సామాన్య కుటుంబంలో జన్మించి స్వయం ప్రతిభతో ఇండోర్ మహారాణిగా ఎదిగిందని గుర్తు చేశారు. ఇటు మహిళా సాధికారతో పాటు హిందూ ధర్మ సంస్కృతిని కాపాడుతూ ప్రజల్లో పాలకుల్లో జాతీయ భావన నెలకొల్పిన ధీరవనిత అహిల్యాబాయి అన్నారు. మహిళలు మాత అహల్య బాయిని ఆదర్శంగా తీసుకుని చిన్నారుల్లో సంస్కృతి సంస్కారాలను పెంపొందించాలన్నారు.